వలస ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఝలక్ ఇస్తారా?

Update: 2017-03-02 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. మండలి ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రివర్గంలోకి తన తనయుడు లోకేశ్ తో పాటు మరి కొందరికి స్థానం కల్పించాలనుకుంటున్నారు. కొందరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనున్నారు. వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని బాబు డిసైడ్ అయ్యారు. భూమా నాగిరెడ్డి లేదా అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి వంటి వారి పేర్లు విన్పిస్తున్నాయి. అయితే వీరికి మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవిని ఇచ్చారు. దీనిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ పైన కూడా విమర్శలు చేశారు. రాజ్ భవన్ సాక్షిగా ఫిరాయింపుదారులకు పట్టం కట్టారన్న విమర్శను గవర్నర్ కూడా ఎదుర్కొన్నారు.

ఉప ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో.....

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఆలోచనలో పడ్డారట. ఇటీవల రెండు రాష్ట్రాల ఆస్తుల విభజనకు గవర్నర్ తో సమావేశమైన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో గవర్నర్ నరసింహన్ తన మనసులో మాట చెప్పేశారట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటేనే మేలన్న అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తం చేశారని చెబుతున్నారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన వచ్చని కూడా సూచించారట. గతంలో తెలంగాణలో ఎదుర్కొన్న విమర్శలను ఏపీలో నూ ఎదుర్కొనడానికి తాసు సిద్ధంగా లేనని కూడా గవర్నర్ నిర్మొహమాటంగా చెప్పారంటున్నారు. ఈ విషయాన్ని యనమల చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఏం చేయాలన్నదానిపై యోచిస్తున్నారు. పైగా తెలంగాణ టీటీడీపీ నేతలు టీడీపీ నేతలు పార్టీ ఫిరాయించడంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తెలంగాణలో నీతులు చెప్పి.....ఏపీలో అదే పని చేస్తే బాగుండదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు మనసులో మాత్రం తాను మంత్రి పదవి ఇవ్వదలచుకున్న వైసీపీ శాసనసభ్యుల చేత రాజీనామా చేయించాలని కూడా ఒక ఆలోచన మొదలయిందంటున్నారు. రాజీనామా చేసి తిరిగి గెలిచే సత్తా ఉన్న వారికే మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు. దీంతో తొలుత మంత్రివర్గంలోకి తీసుకుందామని భావించిన జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి వంటి వారి పేర్లు ఇప్పుడు కనుమరుగయ్యే అవకాశముంది. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే వైసీపీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు.

Similar News