లోకేష్ సిద్ధాంతం అసలు చెల్లుతుందో లేదో?

Update: 2016-10-19 08:18 GMT

తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో.. లోకేష్ ఓ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలుగుదేశం సిద్ధాంతాల పునాదుల మీద ఉన్న పార్టీ అని చెప్పుకుంటూ.. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సిద్ధాంతం ఖచ్చితం గా అమలవుతుందని ఆయన వెల్లడించారు. సాధారణంగా ఎంత గొప్ప సిద్ధాంతానికైనా కొన్ని మినహాయింపులు తప్పవన్నట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటి వారికి అటు పార్టీ పదవి, ఇటు ప్రభుత్వంలో పదవి కూడా దక్కవచ్చు గాక. కానీ.. ఇప్పుడసలు కేబినెట్ కూర్పు పూర్తయ్యే సరికి లోకేష్ ప్రవచించిన సిద్ధాంతం మనుగడలో ఉంటుందా? మంటగలిసిపోతుందా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

ఎందుంకంటే.. కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తే గనుక.. పార్టీ అద్యక్షుడు కళా వెంకటరావుకు కూడా చోటు కల్పించే అవకాశం మెండుగా ఉంది. దానికి సంబంధించి.. ఆయన కుటుంబానికే చెందిన కిమిడి మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా అనుకుంటున్నారు. ఆమెతో ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా పదవినుంచి తప్పించే సంగతి కూడా చెప్పినట్లుగానే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కళా వెంకట్రావుకు కూడా పదవి ఇస్తే.. అక్కడితో ముగ్గురికీ జోడు పదవులు అవుతాయి. చంద్రబాబు, లోకేష్, కళా వెంకట్రావు ముగ్గురూ అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నట్లు అవుతుంది. అలాగని మంత్రి పదవి కోసం ఇప్పటికిప్పుడు కళా వెంకట్రావును పార్టీ అద్యక్ష స్థానం నుంచి తప్పించడం జరగదు. ఆయనను ఆ పదవిలో కూర్చో బెట్టి చాలాకాలం కాలేదు.

అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒకే పదవి అంటూ లోకేష్ చెప్పిన సిద్ధాంతానికి కాలం చెల్లినట్లేనా? అని పార్టీలో అనుకుంటున్నారు. ఇలాంటి సిద్ధాంతాలు .. పదవుల కోసం ఆబ్లిగేషన్లు చేసే వారికి వినిపించడానికి పనికి వస్తాయని.. అంతే తప్ప ఆచరణలో తమకు కావాల్సిన వారందరికీ రెండేసి పదవులు కట్టబెట్టేయడం సాధారణమేనని పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.

Similar News