రైట్ టూ లెఫ్ట్ : సాగుతున్న పవన్ నడక

Update: 2016-12-02 09:00 GMT

తొలినుంచి కూడా... పవన్ కల్యాణ్ నిండుగా సామాజిక స్పృహ, తగుమోతాదులో రాజకీయ ఆసక్తి ఉన్న వ్యక్తి. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడే చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. ఒక రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా.. ఏం సాధించగలనని చిరంజీవి అయినా కలగన్నాడో లేదో గానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ఆ రాజకీయ వేదిక ద్వారా చాలా చేసేయవచ్చునని అనుకున్నారు. ఆ పార్టీ తరఫున అప్పట్లో ఆయన ముమ్మరంగా రాష్ట్రమంతా కలియతిరిగేసి చేసిన రాజకీయ ప్రసంగాలు, కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి పంచెలు ఊడదీయించి తరిమి కొడతాం అంటూ ప్రదర్శించిన ఆవేశం అన్నీ కలిసి అలాంటి అభిప్రాయాన్ని అందరిలో అలాంటి అభిప్రాయాన్ని నాటాయి. ప్రజారాజ్యం పతనం కాగానే.. పవన్ లోని రాజకీయ ఆవేశం మొత్తం నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఆయన సాఫ్ట్ ఎంట్రీతో జనసేన పార్టీని ప్రకటించారు. ‘ఎన్నికలకు అప్పుడే కాదు’ నినాదంతో.. ఎన్డీయే కూటమికి.. అనగా ప్రస్తుతం ఈ వ్యాసం పరిభాషలో.. ‘రైట్’ వాదులకు ఆయన జై కొట్టారు. భాజపా రైటిష్టుల పార్టీ అవుతుందని, తాను అభిమానించే (ఆయన మాటల ప్రకారం) కమ్యూనిష్టు పార్టీలకు బద్ధ వ్యతిరేకి, అని వారి మీద మతవాద ముద్ర కూడా ఉంటుందని .. లాంటి సంగతులేమీ ఆయన అప్పటికి చూసుకుని ఉండకపోవచ్చు. మోదీ మీద ఒక నమ్మకం, ఆయన పాలన వస్తే మంచి జరుగుతుందనే విశ్వాసంతోనే ముమ్మరంగా ప్రచారం చేశారు. ఏది ఏమైనా ప్రారంభంలో ‘రైట్’ పార్టీల అనుకూల వ్యక్తిగానే ఉన్నారు.

ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి ఎదురైన అనుభవం తరువాత.. ఆయనకు ఆశల పొరలు ఏమైనా కమ్మి ఉంటే అవన్నీ తొలగిపోయాయి. మోదీని నేరుగా పేరెత్తి అనకపోయినా.. మోదీ సర్కారులో తాను ఎవరిని నిందిస్తే పరవాలేదో.. అలాంటి వారిని తీవ్రాతితీవ్రంగా నిందిస్తూ సభలు నిర్వహించారు. కమ్యూనిష్టులు అంటే నాకెంతో ఇష్టం.. ఆ పార్టీల్లో తెలంగాణలో నాకు చాలా మంచి మిత్రులున్నారు. వారి సిద్ధాంతాలు ఇష్టం, పోరాటాలు ఇష్టం అంటూ కూడా సెలవిచ్చారు. బహుశా గత ఎన్నికల్లో ఆయనతో కలిసి తిరిగిన భాజపా వాదులకు, ఇలా వామపక్షాలను పొగడడం నచ్చి ఉండకపోవచ్చు.

అయితే పవన్ కల్యాణ్ తమ గురించి పాజిటివ్ గా చెప్పిన మాటలను.. వామపక్షాలు ఎడ్వాంటేజీగా మలచుకోదలచినట్లున్నాయి. తాజాగా వామపక్షాల నాయకులు వచ్చి పవన్ కల్యాణ్ ను కలిసి ప్రత్యేకహోదా కోసం తాము సాగించే పోరాటాల్లోకి ప్రత్యక్షంగా దిగాల్సిందిగా కోరడం గమనార్హం. ఆయనను కలిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ.. వామపక్ష పోరాటాల పట్ల పవన్ చాలా సదభిప్రాయంతో ఉన్నారని కూడా చెప్పారు. కొన్ని మీడియా సంస్థలైతే.. చాలా ముందుకెళ్లిపోయి.. వామపక్ష పార్టీలు వెళ్లి కలిశాయంటే.. వచ్చే ఎన్నికలకు పవన్ పార్టీ జనసేనతో వారు పొత్తు పెట్టుకుంటున్నట్లే అంటూ.. వండిన కథనాల్ని కూడా అందించేశాయి.

ఇప్పుడు ఏమవుతుంది?

పవన్ కల్యాణ్ మాత్రం తెలిసో తెలియకో రైట్ నుంచి లెఫ్ట్ వైపు అడుగులు వేస్తున్నారు.

నాయకులు తమ సిద్ధాంతాలను గాలికి వదిలేసి పార్టీలు మారుస్తూ.. తాము ఇచ్చే మద్దతును మార్చేస్తూ ఉండడం.. తద్వారా తమ అవకాశవాదాన్ని ప్రదర్శించడం చాలా సహజమైన సంగతి. ఇంకా ప్రొఫెషనల్ రాజకీయ వాసన అంటని పవన్ కల్యాణ్.. అవకాశ వాదం అనలేం గానీ.. ఆయన నడక మరీ ‘రైట్’ నుంచి ‘లెఫ్ట్’ కు సాగడం అంటే .. అది చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇంతటి వైరుధ్యంతో.. మద్దతులు మార్చేయడం ప్రజలు దృష్టిలో ఆయన ఇమేజిని పలుచన చేయకుండా ఉంటుందా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సభలో ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన మాటలు పక్కవాడికి కూడా వినిపించకుండా.. పెద్దపెట్టున కేరింతలు, హాహాకారాలు చేసే యువతరం అభిమానులకు ఇలాంటి సంగతులు పట్టకపోవచ్చు గాక.. కానీ.. పవన్ మీద ఏ కొంతయినా ఆశ ఉండే ఆలోచనా పరులు ఉంటే, వారికి పవన్ నడక అగమ్యంగా కనిపిస్తుంది.

మరి పవన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కాలం జవాబు చెబుతుంది.

Similar News