రేవంత్ లేఖాస్త్రాలు : న్యాయమార్గం స్ఫురించలేదా?

Update: 2016-11-07 12:56 GMT

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనే ప్రక్రియ ముగిసిపోయిన అధ్యాయం అని అందరూ అనుకుంటూ ఉండవచ్చు గాక. ఒకవైపు తెలంగాణ కొత్త జిల్లాలకు కార్యవర్గాలను కూడా ప్రకటించేసి.. ఇక పార్టీ బలోపేతం మీద గులాబీ బాస్ దృష్టి పెడుతున్నారు. కొత్తజిల్లాలకు కనీసం అడ్ హాక్ కమిటీల నియామకాన్ని పూర్తిచేసి.. తమ తమ పార్టీలను బలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం కూడా తమ కసరత్తు తాము చేస్తున్నాయి. ఈరీతిగా.. ఒకవైపు.. జిల్లాల ఏర్పాటు వ్యవహారం అంతా గతించిపోయిన అధ్యాయం అని అంతా అనుకుంటూ ఉండగా.. దాన్ని తెలంగాణ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తిరగతోడుతున్నారు.

తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది నియమాలకు, చట్టాలకు వ్యతిరేకంగా జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిజానికి జిల్లాల ప్రకటన పూర్తయిన ఒకటి రెండు రోజుల వరకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇలాంటి వాదన వినిపించాయి. ఆ తర్వాత శాంతించాయి. ఏదో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాలి గనుక.. అంటున్నాయి తప్ప.. అంతటితో ఊరుకున్నారు లెమ్మని అంతా అనుకున్నారు. కానీ ఇన్ని రోజుల తర్వాత.. ఇప్పుడు ఇంకా ఆ అంశం పాతబడిపోలేదన్నట్లుగా రేవంత్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు చట్ట విరుద్ధం అనే అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు.

నియమాలకు, చట్టాలకు విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు చేశారంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రపతి, ప్రధాని, ఎన్నికల సంఘం కమిషనర్ లకు లేఖలు రాశారు. చట్టవిరుద్ధంగా ఈ వ్యవహారాలు అన్నీ జరిగే ఉంటే గనుక.. రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలుగా వారి దృష్టికి తీసుకువెళ్లడం సబబుగానే ఉంటుంది.

అయితే ఇక్కడ సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం మరొకటి కూడా ఉంది. లేఖాస్త్రాలు సంధించడం ద్వారా.. ఏదో కాస్త సంచలనం రేకెత్తించడం, ఈ అంశాన్ని రచ్చకీడ్చడం వరకు రేవంత్ కు సాధ్యమవుతుంది. అయితే.. నిజంగానే చట్టవిరుద్ధంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన సాధికారికంగా భావిస్తూ ఉంటే గనుక.. తన వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చు కదా అనేది మెజారిటీ జనానికి కలుగుతున్న సందేహం. జిల్లాల ఏర్పాటులో చట్టవిరుద్ధత, నియమాలను తుంగలో తొక్కడం జరిగి ఉంటే గనుక.. కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి న్యాయస్థానం ద్వారా.. జిల్లాల ప్రక్రియకు బ్రేకుల వేయగల అవకాశం వాడుకోకుండా... కేవలం లేఖాస్త్రాలకు మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారా? అని పలువురు ఆలోచిస్తున్నారు.

Similar News