రాధాకు రాజకీయ భవిష్యత్ లేదా?

Update: 2017-11-12 05:30 GMT

ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఒకప్పుడు వంగ‌వీటి అనే ఇంటిపేరు రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు వేదిక అయింది. ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి, మాస్ పీపుల్ కి వంగ‌వీటి కుటుంబం రాజ‌కీయ అండ‌గా నిలిచింది. వంగ‌వీటి రంగా మొద‌లు ఆయ‌న సోద‌రుడు రాధా వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో తిరిగారు. అప్ప‌ట్లో బ‌లంగా దూసుకు వ‌చ్చిన అన్న‌గారు ఎన్టీఆర్‌ను సైతం రంగా ఢీ అంటే ఢీ అని రాజ‌కీయంగా పోరాటాలు చేశారు. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిస్థితిలో ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌న వార‌సుడిగా అరంగేట్రం చేసిన వంగ‌వీటి రాధా రాజ‌కీయంగా తీవ్ర వివాదాస్ప‌దం అయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యం రాజ‌కీయంగా స‌మాధి చేస్తోంద‌నే విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

వైఎస్ ఆశీర్వాదంతోనే....

2004లో అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశీర్వాదంతో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున‌ ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకున్నాడు వంగ‌వీటి రాధా. అప్ప‌ట్లో సూప‌ర్ మెజారిటీతో గెలుపొందారు కూడా. ఆయ‌న వ‌య‌స్సు అప్పుడు కేవ‌లం 26 మాత్ర‌మే. ఆ విజ‌యంతో రాధా ఒక్క‌సారిగా త‌న సామాజిక‌వ‌ర్గంలో హీరో అయ్యాడు. అయితే, అప్ప‌టి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ అనురాధ‌తో ఆయ‌న ప‌డ్డ వివాదం రాజ‌ధానికి చేరి తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించింది. ఈ క్ర‌మంలో వైఎస్ రాధాను ''చిన్న పిల్లోడు'' అని చేసిన కామెంట్లు స్థానికంగా రాధాకు ఉన్న ఇమేజ్‌ను కొంత వ‌ర‌కు డ్యామేజ్ చేశాయి. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్ట‌డంతో త‌న సామాజిక‌వ‌ర్గం త‌న‌కు అండ‌గా ఉంటుంద‌ని భావించిన రాధా క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండాపార్టీ నుంచి జంప్ చేశారు.

మంత్రి ఇస్తానని చెప్పినా...

అయితే, ఈ క్ర‌మంలోనే వైఎస్.. రాధాను హైద‌రాబాద్‌కి పిలిచి 2009 ఎన్నిక‌ల్లో గెలిస్తే.. మంత్రి సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయినా కూడా రాధా త‌న మ‌న‌సు మార్చుకోకుండా చిరు ప‌క్క‌న చేరారు. అయితే, అప్ప‌టి వైఎస్ హ‌వా ముందు రాధా కొట్టుకుపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణించ‌డం, చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం వంటివి వ‌రుస‌గా జ‌రిగాయి, దీంతో రాధా మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి రావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, రాధా ఆప‌నిచేయ‌కుండా త‌ట‌స్థంగా ఉండిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ కుమారుడు జ‌గ‌న్ పెట్టిన వైసీపీలో చేరి, 2014లో టికెట్ అయితే సంపాయించుకున్నారు కానీ, ప్ర‌జ‌ల్లో పాపులారిటీ సంపాయించాల‌నే విష‌యంపై దృష్టి పెట్ట‌లేదు.

తండ్రి పేరు చెప్పుకుంటూనే....

దీంతో రాధా తీవ్ర‌మైన ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు. అంతేకాదు, ఎంత సేపూ త‌న తండ్రి సంపాయించిన ఇమేజ్‌తోనే కాలం గ‌డిపేసేందుకు కుతూహ‌లం పెంచుకున్నాడు త‌ప్ప త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ వేదిక‌ను ఆయ‌న ఏర్పాటు చేసుకోలేక‌పోయాడు. దీంతో ఇంటికే ప‌రిమిత‌మై పోయాడు. దీంతో రాధా ప‌రిస్థితిని గ‌మ‌నించిన జ‌గ‌న్.. దాదాపు ప‌క్క‌న పెట్టేశాడు. రాధా గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన‌ నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ‌ తూర్పులో వైసీపీ ఇంచార్జ్‌గా బొప్ప‌న భావ‌కుమార్‌ను నియ‌మించారు. ఇటు సెంట్ర‌ల్ సీటు ఇటీవ‌ల పార్టీలో చేరిన మ‌ల్లాది విష్ణుకు ఇస్తార‌ని అంటున్నారు. ఇటీవ‌ల వైసీపీ నేత, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గౌతంరెడ్డి ఏకంగా రంగా హ‌త్య‌పై తీవ్ర కామెంట్లు కుమ్మ‌రించారు.

పవన్ ఆహ్వానం కోసమే....

ఈ క్ర‌మంలో మ‌రోసారి రోడ్డుమీద‌కి వ‌చ్చారు రాధా ఆయ‌న త‌ల్లి ర‌త్న‌కుమారి. అయితే, దీనిపై అప్ప‌టిక‌ప్పుడు స్పందించిన జ‌గ‌న్‌.. గౌతం రెడ్డిని స‌స్పెండ్ చేశారే కానీ, త‌దుప‌రి చ‌ర్య‌లు ఇప్ప‌టికీ చేప‌ట్ట‌లేదు. దీంతో వంగ‌వీటి రాధాను జ‌గ‌న్ ప‌క్క‌న పెడుతున్నార‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరింది. ఈ ప‌రిణామంతో మ‌రింత‌గా కుంగిపోయిన రాధా.. ఇప్పుడు గుమ్మ‌మే దాట‌డం లేదు. అయితే, ఆఫ్ దిరికార్డుగా ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నార‌ని అంటున్నారు కొంద‌రు. అంటే.. జ‌న‌సేన పూర్తిగా కార్య‌క‌లాపాలు విస్త‌రిస్తే.. తిరిగి పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని చెబుతున్నారు. ఏదేమైనా రాధా ఇమేజ్ రోజురోజుకు గ్రౌండ్ లెవ‌ల్‌ను దాటేసి పాతాళానికి ప‌డిపోతోంద‌న్న‌ది వాస్త‌వం. రాజ‌కీయంగా తొలిద‌శంలో తండ్రి ఇమేజ్ వాడుకున్నా.. త‌న‌కంటూ ఇప్ప‌టికీ ఎలాంటి వేదిక‌నూ ఏర్పాటు చేసుకోక‌పోవ‌డం పెద్ద త‌ప్ప‌నేది విశ్లేష‌కుల మాట‌! మ‌రి రాధా ఇప్ప‌టికైనా జ‌నాల్లోకి వ‌స్తాడా? లేడా? అన్న‌ది వేచి చూడాలి.

Similar News