మోదీకి లేఖ : ఇవేం మాయదారి బుద్ధులు సార్!

Update: 2016-12-16 12:57 GMT

మోడీ సార్..

మీరుగా తలచుకోవాలే గానీ.. మౌనం పాటించడంలో మన్మోహన సింగు కంటే మీరే ఘనాపాటీలనే సంగతి పార్లమెంటు సాక్షిగా నిరూపించగలుగుతున్నందుకు ముందుగా అభినందనలు.

నోట్ల రద్దు తర్వాత.. జనం పడుతున్న యాతనలను చూడగలగడంలో మీరు కబోదుల్లాగానూ... ఇనప్పెట్టెల్లో నల్లధనం నిల్వలు పెంచుతున్న వారిని పట్టుకోవడంలో మీరు కబంధుల్లాగానూ... జనాలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి ప్రోత్సాహకాలను ప్రకటించడంలో మీరు ఆప్త బంధుల్లాగానూ బహుముఖ పాటవాల్ని ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషం అందుకు కూడా అభినందనలు.

మీరు నేరుగా ఒప్పుకోకపోయినప్పటికీ జనం పడుతున్న కష్టాలు.. మీ సర్కారు మీద వ్యతిరేకత పెంచుతుందనే ఆందోళన ఏలినవారిలో అంకురించినట్లుగా మాకు ద్యోతకమవుతోంది. ‘‘ప్రజలు అద్భుతమైన వాళ్లు, వాళ్లు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు..’’ అంటూ పడికట్టు మాటలతో చక్కగా బుకాయిస్తున్నారు గానీ.. వాస్తవాలను మీరు గుర్తించినందుకు చాలా సంతోషం. జనాగ్రహం గురించిన వాస్తవాల్ని గుర్తించబట్టే.. నోట్లు సకాలంలో అవసరానికి చాలినంత సరఫరా చేయలేని అశక్తత (ప్రత్యర్థుల దృష్టిలో అమసర్థత)ను కప్పెట్టుకోవడానికి వీలైనంత తొందరగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించాలని చూస్తున్నారు. సంతోషం

ఆ ప్రయత్నంలో భాగంగా.. మీరు చేస్తున్న ప్రయత్నమే కాస్త మాయదారి మార్గంలాగా కనిపిస్తోంది. లాటరీ టిక్కెట్లు అమ్ముకుని బతికే చిన్న రాష్ట్రాల్లాగా.. లాటరీలనే అనుచితమైన ఆశ చూపించి.. వారిని ఆకర్షించాలని చూస్తున్నారు ఎందుకు. ఇలాంటి తాత్కాలిక మెరమెచ్చు మార్గాలతో జనాన్ని ఆకర్షించే ప్రయోగాలు, ఆ పేరిట కొన్ని కోట్లు తగలేయడానికి చేస్తున్న కసరత్తు చూసి మీరు అంతగా మురిసిపోతున్నారు ఎందుకు? పన్నుల వ్యవస్థలో చిన్న మార్పులు తెచ్చి.. నగదు రహిత లావాదేవీల మీద పడే రుసుములను పూర్తిగా రద్దుచేసి.. సామాన్యుడికి నియమితమైన లబ్ధిని కలిగించినట్లయితే.. ప్రతి ఒక్కరూ స్వతహాగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లే అవకాశం ఉంటుంది కదా! ఎంతో వివేచన కలిగిన తమ సర్కారు కూడా అలాంటి నిర్మాణాత్మకమైన మార్గాన్ని అనుసరించకుండా.. ఇలాంటి వక్ర, తాత్కాలిక మార్గాలు అనుసరిస్తున్నది ఎందుకు.?

ఫరెగ్జాంపుల్.. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు రూపేణా ... డిజిటల్ లావాదేవీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. రుసుములు ఎందుకు విధిస్తున్నారు. ప్రతి టిక్కెట్ మీద దాదాపు 15 నుంచి 20 రూపాయల వరకు సామాన్యుడు చెల్లించాల్సి వస్తోంది. ఆన్ లైన్ లో సదరు సంస్థకు ఎలాంటి వ్యయం ఉంటుంది గనుక.. ప్రతి టిక్కెట్ మీద అంతంత సొమ్ము వారు భారం వేస్తున్నట్టు? ఈ కోణంలో మీ సర్కారులు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి.

సామాన్యుడికి నిత్య, దైనందిన జీవితంలో ఉండే సగటు, ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ చేయడంలో ఉండే సాధారణ లోపాలను సరిదిద్ది.. సమాజానికి హితకారకమైన వ్యవస్థీకృత ప్రోత్సహాన్ని మీరు అందించాలి తప్ప.. లాటరీ టికెట్లు అమ్ముకునే వాళ్లలాగా.. ఇలాంటి అనుచితమైన ప్రోత్సాహకాలు ప్రకటించడం ఏ రకంగా సబబు! ఏ రకంగా వివేకం అనిపించుకుంటుంది?

ప్రభుత్వం అనేది వ్యవస్థను బాగు చేయాలి? కానీ మీరు ప్రకటించిన లాటరీ యోజన లు అలాంటి పనిచేస్తున్నాయా?

లాటరీలు అనేవి జనజీవితాలను ఛిద్రం చేస్తున్నాయని... వాటి మాయలో పడి జనం సర్వనాశనం అవుతున్నారనే భావనతో ప్రభుత్వమే వాటిని నిషేధించింది. మళ్లీ డిజిటల్ లావాదేవీ పేరుతో.. అనాయాసమైన అనుచిత లబ్ధివైపు జనాన్ని ప్రోత్సహించాలని మీరెందుకు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ డిజిటల్ ముసుగులో లాటరీ పద్ధతికి తెరతీస్తున్న సర్కారుకు మరిన్ని భిన్నమైన ఆదాయ మార్గాలు స్ఫురించి.. ప్రజలను పెడమార్గంలో నడిపించవని గ్యారంటీ ఏమిటి? డిజిటల్ చెల్లింపులు ఉండేట్లయితే.. పేకాట వంటి జూదగృహాలకు విచ్చలవిడి అనుమతులు, డిజిటల్ చెల్లింపు ద్వారా కొంటే.. గుట్కా, సిగరెట్, మద్యం లపై కాసింత డిస్కౌంటు లాంటివి ప్రకటిస్తే.. ఆదాయం పెరుగుతుందనే దుర్బుద్ధులు ... తమ లాటరీల స్పూర్తితో ఏ రాష్ట్రప్రభుత్వాల్లోనైనా మొదలైతే జనం పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వం – ప్రజలకు చట్టబద్ధమైన వ్యవస్థను అందించే యంత్రాంగం లాగా పనిచేయాలి. అంతే తప్ప.. వారికి ఎరవేసి పబ్బం గడుపుకునే కన్సల్టెన్సీ లాగా పనిచేయకూడదు. ఏమంటారు?

ఇట్లు

మీ విధేయుడు

Similar News