మోదీకి మరో లేఖాస్త్రం సిద్ధం చేస్తున్న చంద్రబాబు

Update: 2016-11-15 19:30 GMT

ఆర్థిక లావాదేవీల పట్ల సామాన్య ప్రజల్లో కూడా నిజాయితీ పెరగాలంటే ఓ భేషైన సూచనను చంద్రబాబునాయుడు తెరమీదికి తెస్తున్నారు. ప్రస్తుతం జనానికి ఎదురవుతున్న నోటు కష్టాల గురించి దాదాపుగా ప్రతిరోజూ బ్యాంకర్లు మరియు ఉన్నతాధికారులు, ఆర్థికవేత్తలతో సమావేశాలు పెట్టుకుంటూ మార్గాలను సమస్యలు తీర్చే మార్గాలను అన్వేషిస్తున్న చంద్రబాబునాయుడు.. శాశ్వతంగా ప్రజల్లో తమ లావాదేవీల పట్ల పన్నుల చెల్లింపుల పట్ల నిజాయితీ మరియు పారదర్శకత పెంచడానికి కొన్ని సూచనలు కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు ఈ సూచనలతో ప్రధాని నరేంద్రమోదీకి కొత్తగా ఓ లేఖ రాయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

సాధారణంగానే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబునాయుడు.. ఆన్ లైన్ లావాదేవీలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నగదు రహిత లావాదేవీలు పెరిగేలా జనాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యతను చంద్రబాబునాయుడు మోదీ దృష్టికి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.

కార్డు ద్వారా మరియు కంప్యూటరు ద్వారా, మొబైల్ ఫోనుల ద్వారా లావాదేవీలు అన్నీ జరిగితే.. సమస్తం పారదర్శకంగా ఉంటుందనేది ఆయన సూచన. ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవి కూడా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు బాగుంటుందని ఆయన సూచిస్తున్నారు. అయితే.. చంద్రబాబు చేస్తున్న మంచి సూచన ఏంటంటే.. ఆన్ లైన్ లేదా మొబైల్ ద్వారా జరిగే లావాదేవీల మీద ప్రస్తుతం విధిస్తున్న రుసుములు అన్నిటినీ రద్దు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. నిజానికి ఇది చాలా సహేతుకమైన డిమాండ్. బ్యాంకులు శాఖకు వ్యక్తి వెళితే.. సేవలు అందించడానికి కాస్త పనిచేయాల్సి వస్తుంది గానీ.. ఆన్ లైన్ లో లావాదేవీ అంటే.. వారికి అయ్యే శ్రమ, వారు చేసే సేవ ఏమీ ఉండదు. కాకపోతే.. ప్రతి చిన్న లావాదేవీకి రుసుములు మాత్రం భారీగా వడ్డిస్తుంటాయి. ఆన్ లైన్ జరిగే లావాదేవీలన్నిటికీ రుసుములను తొలగిస్తే.. జనం వాటిని వాడడం పెరుగుతుందని కోరుతూ చంద్రబాబునాయుడు , ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం గనుక.. మోదీకి కొత్త ఆలోచన ఇచ్చి కార్యరూపంలోకి వచ్చినట్లయితే.. వ్యవస్థకు చాలా మేలు జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

Similar News