మొక్కుబడిగా మోగుతున్న ‘గంటా’

Update: 2016-11-20 04:20 GMT

గంటా శ్రీనివాసరావు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాశాఖా మంత్రి. కానీ ఆయన స్వరం సాధారణంగా ఫలితాలు విడుదల అవుతున్నప్పుడు మాత్రమే ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. విద్యారంగం కష్టాల గురించి, గాడితప్పున విద్యాలయాల గురించి ఆయన గళం విప్పడం చాలా పరిమితంగా ఉంటూ ఉంటుంది. పైగా ఆయన చాలా తరచుగా విదేశీ పర్యటనల్లో విస్తృతంగా గడుపుతూ ఉంటారు. ఇక్కడి విద్యాశాఖ మంత్రికి అంత ఎక్కువగా విదేశీ పర్యటనలు ఏం ఉంటాయో అర్థం కాని సంగతి. అదొక ఎత్తు అయితే..

తాజాగా రాష్ట్రంలో కళాశాలల్లో వ్యవస్థ సక్రమంగా లేక లెక్చరర్ల వేధింపుల వల్ల ఉషారాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు బాధ్యతగల మంత్రిగా చూపిస్తున్న చొరవ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వైకాపా ఎమ్మెల్యే రోజా రెండు రోజుల కిందట చాలా అడ్డగోలుగా గంటా మీద విమర్శలు కూడా చేశారు.

అయితే గంటా వైఖరి కూడా చాలా కీలకమైన అంశాల విషయంలో చాలా మొక్కుబడిగానే ఉంటున్నదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించినప్పుడు, ప్రధానంగా.. అవి వివాదాస్పద మరణాలు, విద్యాలయాల వైఫల్యలాలు దుర్మార్గాల వల్ల సంభవించిన మరణాలు అయినప్పుడు.. మంత్రి అక్కడకు వెళ్లి ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంటుంది. కానీ గంటా శ్రీనివాసరావు విషయంలో చాలా మొక్కుబడి సంతాప తీర్మానాలు తప్ప మరో చర్య ఉండదు.

ఏపీలో విద్యార్థులు వివాదాస్పదంగా మరణించిన వెంటనే.. ‘‘విదేశాల్లో ఉన్న గంటా శ్రీనివాసరావు గారు అమెరికానుంచి అధికార్లతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా అధికార్లను ఆదేశించారు’’ అంటూ ఆయన పీఆర్వోల నుంచి ఒక మొక్కుబడి ప్రకటన వచ్చేస్తుంది. ఇంతకూ అసలు ఈ దుర్మరణం గురించి గంటాకు సమాచారం ఉన్నదో లేదో అని అనుమానం వచ్చేంతగా ఆ మొక్కుబడి చర్యల ప్రకటన తయారవుతుంది.

విద్యాలయాల్లో వరుస ఆత్మహత్యలతో వ్యవస్థ మొత్తం గాడితప్పుతున్నప్పుడు మంత్రిగారు పట్టించుకోపోవడం చాలా దారుణం అని పలువురు భావిస్తున్నారు. ఆయన అధికారులతో మాట్లాడితే ఆ విషయాన్ని అధికారులే ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో ఏం చర్యలకు ఆదేశించారో చెబితే బాగుంటుంది గానీ.. మొక్కుబడిగా పీఆర్వోలు సంతాప- తగు చర్యల ప్రకటనలు విడుదల చేస్తే చాలని అనుకుంటే.. అది చాలా బాధ్యతారాహిత్యం అని పలువురు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పెరగవచ్చు. మంత్రి విదేశాల్లో విలాసాల్లో కాకుండా.. కనీసం రాష్ట్రంలో ఉండి.. ఏదైనా తదనుగుణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటే అందులో తప్పేముంది.

Similar News