ముద్రగడకు స్వపక్షీయుల్లో మద్దతు తగ్గిందా?

Update: 2016-11-15 07:00 GMT

ముద్రగడ పద్మనాభం బుధవారం ఉదయం నుంచి సత్యాగ్రహ పాదయాత్ర చేయవలసి ఉంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పాదయాత్రను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, ఆయన పాదయాత్రలో పాల్గొనే వారివలన అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉన్నదని, శాంతి భద్రతల సమస్య గనుక, అనుమతి ఇవ్వబోయేది కూడా లేదని తేల్చేసింది. అయితే ఆరునూరైనా యాత్ర అనుకున షెడ్యూలు ప్రకారం చేసి తీరుతానని ముద్రగడ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన ప్రముఖులు, కుల పెద్దల్లో ముద్రగడ దీక్షల పట్ల సానుకూలత తగ్గిందా? ఆయన కాపు గర్జన సభ పెట్టిన నాటికి, ఇవాళ సత్యాగ్రహ పాదయాత్రను సంకల్పిస్తున్న నాటికి కాపు వర్గ పెద్దలు ఆయనకు ప్రకటించే మద్దతులో తేడా వచ్చిందా అనే అనుమానాలు పరిశీలకులకు కలుగుతున్నాయి. మరోవైపు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి లో రెండు రోజుల ముందునుంచే పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఎందుకంటే.. ముద్రగడ సంకల్పిస్తున్న పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోయేది లేదని ప్రభుత్వం కొన్ని రోజులుగా చెబుతూనే ఉంది. నాలుగురోజుల కిందట డీజీపీ సాంబశివరావు ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఆయన యాత్ర చేస్తే అల్లర్లు జరుగుతాయనే అనుమానాల్నే వ్యక్తం చేశారు. నిజానికి ఒక సామాజిక వర్గం వారు అల్లర్లు చేస్తారు అని అనుమానించినట్లుగా ఆ ఆరోపణలు ఉన్నప్పటికీ, పాదయాత్రను అనుమతించం అని డీజీపీ స్పష్టంగా చెప్పినప్పటికీ.. ముద్రగడకు అనుకూలంగా కాపు పెద్దలెవ్వరూ గళం విప్పలేదు.

తాజాగా సోమవారం నాడు హోం మంత్రి చినరాజప్ప కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పాదయాత్ర వల్ల అల్లర్లు జరిగితే ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆయన యాత్రకు అసలు అనుమతి లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని ఖండిస్తూ కూడా కాపు పెద్దలెవ్వరూ మాట్లాడలేదు. ముద్రగడ ఒక్కరే తన దీక్ష మాత్రం కొనసాగుతుంది అంటున్నారు. ఆయనకు మద్దతుగా పెద్దలు ముందుకు రాకపోవడం గమనించాల్సిన విషయం. సామాజికవర్గానికి చెందిన పెద్దల్లో ఆయన పోరాటానికి మద్దతు తగ్గిందా అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. నిజానికి గతంలో కాపు గర్జన సమయంలో ఆయన తన ఉన్న ఊరు నుంచి కదలకుండా పిలుపు ఇచ్చినా.. అనూహ్య స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. ఆయన హైదరాబాదులోని కాపు పెద్దలతో భేటీ కావడానికే రెండుసార్లు నగరానికి పర్యటించారు. కాకినాడలో పెట్టిన సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సంకల్పించిన పాదయాత్ర గతంలో మాదిరిగా విసృత ప్రభావం చూపగలిగేదిగా సాగకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.

Similar News