మాజీ మంత్రి పల్లెను పక్కనపెడతారా?

Update: 2017-11-10 09:30 GMT

పల్లె రఘునాధరెడ్డి. మొన్నటి వరకూ మంత్రి. కొంతకాలం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో మంత్రి పదవి కాల్వ శ్రీనివాసులును వరించింది. మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలోనే పల్లె రఘునాధరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో ఒక ఆడియో హల్ చల్ చేసింది. తనకు మంత్రి పదవి లేకున్నా.. చీఫ్ విప్ పదవి వస్తుందని, తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని పల్లె సన్నిహితులతో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. దీనిపై అప్పట్లో ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యారు. కాగా మంత్రి పదవి పోయిన తర్వాతపల్లె రఘునాధరెడ్డి కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో కూడా ఆయనకు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి కాదు. సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.

కాగితకే ఛాన్స్ ఉందా?

అనంతపురం జిల్లా పుటపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లె రఘునాధరెడ్డికి అక్కడ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప బద్ధ శత్రువుగా తయారయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి ఆయన అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తాను గాని తన కుమారుడికి గాని సీటు దక్కాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో పల్లె రఘునాధరెడ్డికూడా తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇప్పటికే ఎంపీ నిమ్మల కిష్టప్పపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. చినబాబు దృష్టికి కూడా తన సమస్యను తీసుకెళ్లారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో తనకు కీలకమైన పదవి ఉండాలని పల్లె భావిస్తున్నారు. అందుకోసం చీఫ్ విప్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవి కోసం ఇప్పటికేచంద్రబాబు ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నారు. వారిలో పల్లె రఘునాధరెడ్డి, బోండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు. ఇందులో బోండా ఉమామహేశ్వరరావు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వలేదని బోండా పరిధికి మించి మాట్లాడారు. దీంతో చంద్రబాబు పిలిచి మరీ బోండాకు క్లాస్ పీకారు. ఇక కాగిత వెంకట్రావు చాలా సీనియర్ నేత. ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పదవి ఇవ్వలేదు. పల్లె రెండున్నరేళ్లయినా మంత్రిగా చేశారు కాబట్టి కాగితకే ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశముంది.

జమ్మలమడుగు నేతకు....

శాసనసభ చీఫ్ విప్ పదవితో పాటుగా మండలి ఛైర్మన్, మండలిలో చీఫ్ విప్, విప్ ల పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. మండలి ఛైర్మన్ గా ఇప్పటికే నంద్యాల నేత ఎన్ఎండీ ఫరూక్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఇక మండలి చీఫ్ విప్ రేసులో టీడీ జనార్థన్, వైబీ రాజేంద్ర ప్రసాద్, జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డికి ఈ పదవి దక్కే అవకాశముందని చెబుతున్నారు. తన నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్న రామసుబ్బారెడ్డికి చీఫ్ విప్ పదవి ఇచ్చి చల్లార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇక మండలి విప్ ల రేసుల్లో బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీష్ లు ఉన్నారు. వీరిలో బుద్దా వెంకన్నకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తం మీద రెండురోజుల్లో ఈ పదవులను చంద్రబాబు భర్తీ చేయనున్నారు.

Similar News