‘మహా’ యత్నాలతో మరో ముసలం తప్పదా?

Update: 2016-11-07 05:31 GMT

ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు.. ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ.. శరవేగంగా మార్పుచేర్పులకు గురవుతున్నాయి. ఈ రాష్ట్రంలో తమకంటూ సొంత బలం గానీ, వేరే గత్యంతరంగానీ లేని కాంగ్రెస్ పార్టీ మహా కూటమి పేరుతో.. బలమైన పార్టీల పంచన చేరి.. మనుగడ సాగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏమాత్రం సానుకూలంగా పరిణమించేలా కనిపించడం లేదు. పైగా... కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల పుణ్యమాని అధికార సమాజ్‌వాదీ పార్టీలో మరోసారి ముసలం పుట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా కుటుంబ తగాదాల నేపథ్యంలో పార్టీలో పుట్టిన ముసలం.. నేతాజీ ములాయం సింగ్ యాదవ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబంలో గొడవ గనుక.. వెంటనే ఒక కొలిక్కి రాగలిగింది. అదే ఇతర పార్టీలు మరియు ఇతర నాయకుల ప్రమేయంతో ముడిపడిన వ్యవహారం పర్యవసానంగా ముసలం పుడితే.. అది అంత సులువుగా ఎలా తేలుతుంది? అదే ఇప్పుడు విశ్లేషకులకు కలుగుతున్న మీమాంస!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలకు పార్టీలకు మరీ ఏకపక్షంగా సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చుననేది చాలా మంది అంచనా వేస్తున్న సంగతి. అధికార సమాజ్‌వాదీ అఖిలేష్ సీఎం అభ్యర్థిగా మరో మారు ఎన్నికలను ఎదుర్కొనబోతున్నది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి రాగల పాటి సత్తా తమకు ఏమాత్రం లేకపోయినా.. సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూటమి రూపంలో జట్టు కడదాం అంటూ సమాజ్ వాదీ పంచన చేరడానికి ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు ఇప్పటికే ములాయంతో రెండు దఫాల చర్చలు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సమాజ్‌వాదీతో పొత్తులు కలిగి ఉండగల ఇతర జనతా పరివార్ నాయకులతో కూడా ఆయన ఇదివరకే మంతనాలు సాగించినట్లు కూడా పుకార్లు ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ పొత్తులు, మహా కూటమి అనే ప్రతిపాదనలకే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉన్న సీట్లలో కాంగ్రెస్ కు 100 కేటాయించినా వారు సంతృప్తి పడే పరిస్థితిలోనే ఉన్నారు గానీ.. వారికి అవి ఇవ్వడం కూడా అనవసరం.. మనమే నేరుగా ఎన్నికలకు వెళితే నెగ్గుతాం... మన మీద కాంగ్రెస్ ను భారంగా భరించడం ఎందుకు అనేది అఖిలేష్ ఒక వ్యూహం. అదే సమయంలో.. ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అమర్ సింగ్ ఇలాంటి మహా కూటమి యత్నాల వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే అనుమానాల వల్ల కూడా ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేత ప్రశాంత్ కిశోర్ , ములాయంను ఇప్పటికే పలుమార్లు కలిసినా.. అఖిలేష్ తనతో కలవడానికి ఒక్కసారి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటేనే సీరియస్ నెస్ అర్థమవుతుంది. మరి.. ఇప్పుడిప్పుడే కుటుంబ వివాదం సమసి.. పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ తమకు గత్యంతరం లేకపోవడం మూలాన యూపీలో మహా కూటమి అంటూ చేస్తున్న ప్రయత్నాలు పాలక పక్షంలో మరోసారి ముసలం పుట్టిస్తాయా అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News