మరి చంద్రన్న కూడా నజరానాల చిట్టా తీస్తారా?

Update: 2016-10-10 16:17 GMT

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 9 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించేసి.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఒకదాని వెంట ఒకటి వేగంగా జరుగుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటి? అక్కడ పదవుల పంపకాలు జరిగేదెప్పుడు. రెండున్నరేళ్లుగా నామినేటెడ్ పదవులకోసం నాయకులు చంద్రబాబునాయుడు వెంటబడి బతిమాలుతోంటే.. మొన్నటికి మొన్న కొన్ని ప్రకటించారు. ఇంకా బోలెడు ఛైర్మన్ గిరీలు, ఆలయాల పాలక మండలులు అనేకం.. అలా పెండింగ్ లోనే ఉన్నాయి. మరి దసరా గడచిపోయి, దీపావళి కూడా వచ్చేస్తున్నది. చంద్రబాబునాయుడు పండగలకు ప్రజలకు ‘చంద్రన్న కానుక’ అంటూ రేషన్ సరుకులు పంచినట్లుగా, తమకు నామినేటెడ్ పదవులు ఎప్పుడు పంచుతారా? అని పార్టీ నేతలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబునాయుడు కూడా నామినేటెడ్ పదవుల పంపకంలో చాలా జాప్యం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇటీవల ఆయన మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించారు. అయితే అందులోనూ ఒక ఛైర్మన్ గిరీని కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తన్నుకుపోయారనేది.. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న కార్యకర్తల గోల. కాంగ్రెస్ పార్టీకి గతిలేని సమయంలో వలసవచ్చిన నాయకులకు ముందు కోటాలో పదవులు పంచేయాలా అని వారు విచారిస్తున్నారు.

ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ ఒకేసారి 9 కార్పొరేషన్లు ఇచ్చేశారు. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా.. మార్కెట్ కమిటీల నియామకాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు కూడా కాస్త వేడి పుంజుకుని.. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తారో లేదో చూడాలి.

Similar News