మంత్రులు, పెద్దలు ఇలా చేస్తే బాగు బాగు!

Update: 2016-10-03 03:21 GMT

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఏ క్షణాన ఎటునుంచి పాకిస్తాన్‌ తో యుద్ధం మొదలవుతుందో తెలియని పరిస్థితి ఉంది. సరిహద్దుల్లో మామూలు పహరా కాసే కంటె చాలా పెద్ద సంఖ్యలో యుద్ధానికి సిద్ధంగా సైనిక బలగాలను మన దేశం మోహరించి ఉంది. ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఒకసారి సరిహద్దులో మోహరించిన తర్వాత.. అక్కడి సైనికులు అంతా.. ప్రాణాల మీద ఆశ వదులుకునే ఉంటారని అనుకోవడం లో సందేహం లేదు. ఇలాంటి సమయంలో వారికి కాస్త నైతిక స్థైర్యం ఇవ్వడం నిజంగానే చాలా మంచి పని.

ఏపీ ప్రభుత్వంలోని దేవాదాయ శాఖ మంత్రి, భాజపా నాయకుడు పైడికొండ మాణిక్యాల రావు అలాంటి మంచి పనే చేశారు. ఆయన సరిహద్దుల్లో విధుల్లో ఉన్న తమ జిల్లాకు చెందిన సైనికులకు ఫోను చేసి మాట్లాడారు. వారిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. దేశం వారి వెన్నంటి ఉన్నదని వారికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు.

అక్కడి సైనికులతో పైడికొండ మాట్లాడిన వైనం చూసిన తర్వాత.. ఆయన ప్రయత్నం మంచిదనే అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సైనికులకు స్థైర్యం ఇవ్వడం అభినందనీయం. నిజానికి ఈ పనిని సెలబ్రిటీలు తమకు చేతనైనట్లుగా చేస్తే ఇంకా బాగుంటుంది. మంతులు, పెద్దలు సరిహద్దుల్లోని సైనికులకు అవకాశం ఉన్నంత వరకు ఫోన్లలో మాట్లాడి వారికి భరోసా ఇవ్వడం ఈ జాతి అంతా ఒక్కటేననే భావనను పెంచుతుంది. ప్రధానంగా సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తే బాగుటుంది. ఏదో అడ్డగోలుగా పాకిస్తాన్‌ నటుల్ని వెనకేసుకు వచ్చి వివాదాల్లో చిక్కుకునే బదులు సరిహద్దుల్లో వారితో మాట్లాడడం లేదా, వారికి మద్దతుగా బహిరంగ ప్రకటనలు ఇవ్వడం బాగుంటుంది.

Similar News