మంత్రులదరికీ హెరిటేజ్ అసైన్‌మెంట్!

Update: 2016-11-08 13:55 GMT

చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులను నారా లోకేష్ కొన్ని వారాల కిందట ప్రకటించినప్పుడు.. హెరిటేజ్ సంస్థ గురించి చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఆ సంస్థ ఒక్కటీ బాగా లాభాల్లో నడుస్తున్నదని, తమ కుటుంబం మొత్తం బతుకుతెరువుకు అది సరిపోతుందని లోకేష్ గర్వంగా చెప్పుకున్నారు. తన తెలివి తేటలతో నడుస్తున్నదని అనుకుంటున్న వ్యాపారం గురించి చెప్పుకునేప్పుడు బహుశా ఎవరికైనా అలాంటి గర్వమే కలుగుతుంది. కానీ రెండు రోజుల కిందట విశాఖపట్టణం వేదికగా.. ప్రత్యేకహోదా కోసం గళమెత్తిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అప్రస్తుత ప్రసంగంలాగా.. తన మాటల్లోకి హెరిటేజ్ ప్రస్తావనను కూడా తీసుకువస్తూ.. ఆ కంపెనీ షేర్లు అమాంతం ఎలా పెరిగిపోతున్నాయని.. ఆ పెరిగిపోవడం యావత్తూ చంద్రబాబు నాయుడు అవినీతికి నిదర్శనమే అని బహిరంగంగా విమర్శించారు. (హెరిటేజ్ రీటైల్ వ్యాపారాన్ని ఆ మరురోజునే ఫ్యూచర్ గ్రూపునకు వారు భారీ మొత్తానికి విక్రయించడం అనేది బహుశా యాదృచ్ఛికమే కావొచ్చు)

జగన్ హోదా గురించి మాట్లాడిన వెంటనే.. ‘నేరస్తుడైన జగన్ నీతులు మాట్లాడ్డం ఏమిటి’ అంటూ ప్రతి విమర్శలు చేయడానికి తెలుగుదేశం మంత్రులు, నాయకులు సిద్ధంగా ఉంటారు గనుక.. వారంతా ఎడాపెడా జగన్ ను తూర్పార పట్టేశారు. అయితే దాదాపుగా మంత్రులందరూ కూడా.. తమ ఖండన ముండనల్లో భాగంగా.. హెరిటేజ్ సంస్థను కూడా మంత్రులు సమర్థిస్తూ వచ్చారు.

అయితే వెలగపూడి సోర్సెస్ ద్వారా, అభిజ్ఞ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే.. హెరిటేజ్ ను సమర్థిస్తూ మాట్లాడాల్సిందిగా మంత్రులందరికీ అంతర్గతంగా ఒక ఆదేశం వెళ్లిందిట. హెరిటేజ్ వ్యాపారం లొసుగులు, షేర్ ధరల గురించి జగన్ మాట్లాడిన నేపథ్యంలో.. హెరిటేజ్ వ్యాపారం చాలా నిజాయితీగా జరిగే వ్యాపారం అంటూ... డిఫెండ్ చేస్తూ.. దాని గురించి ఒక రకంగా కీర్తిస్తూ మాట్లాడే బాధ్యతను మంత్రులందరికీ పంచిపెట్టినట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశంలో అసలే ప్రభువు మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిపోయిన నాయకులంతా.. హెరిటేజ్ ను డిఫెండ్ చేసుకోవాలని అధినేత ఆలోచిస్తున్నట్లు తెలీగానే ఇక రెచ్చిపోయి ఆ అంశాన్ని అందుకున్నారు. అదే పనిగా ప్రతి ఒక్కరూ జగన్ ను తిట్టడం పూర్తికాగానే హెరిటేజ్ ను కీర్తించే పని కూడా చేసేశారు. అయితే జనం ఇదంతా గమనిస్తూనే ఉంటారని, జగన్ వారి షేర్ల విలువ గురించి మాట్లాడగానే.. వాళ్లంతా సత్యసంధతను చాటుకునే ప్రయత్నం చేయడం ఎబ్బెట్టుగా ఉంటుందని నాయకులు తెలుసుకోవాలి.

Similar News