భుజాలు తడుముకుని తప్పుచేసిన జగన్ కోటరీ!

Update: 2016-10-12 12:12 GMT

చంద్రబాబునాయుడు బుధవారం అమరావతి వెలగపూడిలో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా.. ఓ ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. అందులో చాలా విషయాలు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో దేశంలో నలుగురి నోళ్లలో నానుతున్న బ్లాక్ మనీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ వెల్లడి కావడం జరిగిన నేపథ్యంలో ఒక్క హైదరాబాదులో.. ఒకే వ్యక్తి నుంచి పది వేల కోట్లు నల్లధనం జరిమానాలు చెల్లించి వైట్ మనీగా మారడం అనేదానిని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు స్థాపిస్తారు, అక్రమాలకు పాల్పడుతారు.. ఇలా పేర్లు ప్రస్తావించకుండా చంద్రబాబునాయుడు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే చంద్రబాబు ఈ పదివేల కోట్ల నల్లధనం గురించి.. చంద్రబాబు ప్రస్తావించకపోయినా సరే.. ప్రజల మనసుల్లో ఇప్పటికే రకరకాల వేర్వేరు వ్యక్తుల గురించి అనుమానాలు ఉన్నాయి. వాటిని బలపరుస్తూ గానీ, తేలికపరుస్తూ గానీ.. చంద్రబాబు ఏదో కొన్ని స్వీపింగ్ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారధి స్పందించారు. కేంద్రమే నల్లధనం వెల్లడి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని చంద్రబాబుకు ఎలా తెలిసిందని అన్నారు. పార్థసారధి మాట్లాడుతూ ‘‘చంద్రబాబు ముందు ఒక వ్యక్తి అని నిందలు వేస్తారని, మరురోజు మంత్రులు ఆ పదివేల కోట్లు జగన్ వే అంటూ మాట్లాడుతారని దెప్పిపొడిచారు. పథకం ప్రకారం జగన్ మీద బురద చల్లడానికి చూస్తున్నారని పార్థసారధి వాపోయారు. చంద్రబాబుకు సిగ్గుంటే ఆ పదివేల కోట్లు ఎవరు వైట్‌గా మార్చుకున్నారో వెల్లడించాలని పార్థసారధి అడుగుతున్నారు.

అయితే జనం దృష్టిలో ఎవరిమీదనో ఉన్న అనుమానాలను, పార్థసారధి పనిగట్టుకుని జగన్ మీదికి మళ్లించినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి బ్లాక్ మనీ పేర్లు కొన్ని వెల్లడి అయినప్పుడు హైదరాబాదులోని కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త గురించే జనం అనుకుంటున్నారు. ఆయన నిజానికి వైకాపాతో అనుబంధం ఉన్న వ్యక్తి అయితే కావొచ్చు గాక.. కానీ ఆ బ్లాక్ మనీ జగన్ ది అని జనం అనుకున్నట్లు లేదు. జగన్ అవినీతి చేశాడని అనేవాళ్లు కూడా.. వక్రమార్గాల్లో అంతా వైట్ గానే కంపెనీల్లోకి తెప్పించుకున్నారని అంటుంటారు. అలాంటిది ఇప్పుడు వైకాపా నాయకులు తాము చంద్రబాబు మాటలకు స్పందించి.. అనవసరంగా జనం అనుమానాల్ని జగన్ మీదికి మళ్లించినట్లు అయింది.

Similar News