బీచ్ ఫెస్టివల్ ను చంద్రబాబు భుజాన మోయడం ఎందుకు?

Update: 2016-11-07 13:52 GMT

బీచ్ ఫెస్టివల్ అంటే రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ఈ పదం మనకు కొత్త కాదు. గతంలో సాగర ఉత్సవాల పేరిట కాకినాడలో ఈ బీచ్ ఫెస్టివల్ ను ప్రభుత్వం నిర్వహించింది. అప్పట్లో ఎవ్వరూ అభ్యంతరపెట్టలేదు. ఎలాంటి వివాదాలు రేకెత్తలేదు. అయితే ఈ దఫా మాత్రమే విశాఖలో బీచ్ ఫెస్టివల్ అనే మాట ప్రచారంలోకి వచ్చిన నాటినుంచి ఎందుకు వివాదం జరుగుతోంది? ఇది మౌలికంగా మనం దృష్టి సారించాల్సిన విషయం!

గతంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్ అన్నీ సాంప్రదాయబద్ధంగానే, బీచ్‌లకు కుటుంబసమేతంగా వెళ్లి ఆనందించగల తరహాలోనే.. బీచ్ లో జరిగే ఒక ఈవెంట్ వంటి వేడుకగా మాత్రమే జరిగాయి. అయితే.. ఈ దఫా ఓ ప్రెవేటు సంస్థ వారికి వెర్రి ఆలోచన ఒకటి స్ఫురించింది. బీచ్ ఫెస్టివల్ పేరిట జంటలను అనుమతించి.. రిజిస్టరు చేసుకున్న వారికి ఓ గుడారం, రెండు కుర్చీలు, బల్ల లాంటి సరంజామా ఏర్పాటుచేసి.. ఎంజాయి చేసుకోమని సముద్ర తీరానికి పంపితే.. బిజినెస్ మహ రంజుగా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ మేరకు వారు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన సమర్పించేసుకున్నారు.

ప్రెవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తే చాలు.. పూనకం వచ్చినట్లుగా స్పందించేసే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడు బీచ్ ఫెస్టివల్ ఆలోచనకు మురిసిపోయారు. ఈలోగా వారి ఆలోచనపై నానా రభస, రాద్ధాంతం అయిపోయింది. ఇంతాచేసి.. ఆ ప్రతిపాదనకు ఇంకా ప్రభుత్వపరమైన అనుమతులు కూడా రాలేదు. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం.. బీచ్ ఫెస్టివల్ ఆలోచనను విపక్షాలు విమర్శిస్తున్నందుకు కుతకుతలాడిపోతున్నారు. సంస్కృతి మీద నాకు చాలా గౌరవం ఉంది.. అంటూ చాలా బరువైన డైలాగులు కూడా వల్లించారు. అయితే అప్పటికీ.. బీచ్ ను బాగు చేస్తాం అంటూ ఓ ప్రెవేటు సంస్థ ముందుకు వస్తే.. దానికి కూడా విపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీచ్ ఫెస్టివల్ పేరుతో వారు నానా చెత్త కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంటే.. ముఖ్యమంత్రిగారికి బీచ్ ను బాగు చేయడానికి వారు ఇచ్చిన హామీ ఒక్కటే కళ్లకు కనిపించినట్లుంది. ఇలా ఆయన అర్థసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రెవేటు సంస్థ వారి బీచ్ ఫెస్టివల్ ప్రతిపాదనను ఎందుకు భుజాన మోయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజానికి జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం వారి ఆనందాల్ని చూడాలనుకోవడమే గనుక ప్రభుత్వం ఉద్దేశం అయితే.. కాకినాడ తీరంలో సాగర ఉత్సవాలు నిర్వహించినట్లే.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరిమితుల మేర విశాఖలో బీచ్ ఫెస్టివల్ పెడితే ఎవరు వద్దంటారు? అలాంటి ప్రయత్నం చేయకుండా.. ప్రెవేటు సంస్థలకు గులాంగిరీ చేస్తున్నట్లుగా వారి ప్రతిపాదనను పట్టుకుని చంద్రబాబు ఎందుకు వేళ్లాడుతున్నారో.. దాని పట్ల ఎందుకంత అపరిమిత సానుకూలతను ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని జనం అనుకుంటున్నారు.

Similar News