బాబుకు కొత్త‌ టెన్ష‌న్ మొద‌లైంది!

Update: 2017-11-10 14:30 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. రాజ్య‌స‌భలో కూర్చోవాల‌ని ఆశ‌పడుతున్న 'పెద్ద‌ల' జాబితా నానాటికీ పెరుగుతోంది. త్వరలో రాజ్య‌స‌భలో ఏపీ త‌ర‌ఫున‌ మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒక‌టి వైసీపీకి వెళ్ల‌నుంది. మిగిలిన‌వి టీడీపీకి ద‌క్క‌నున్నాయి. ఈ రెండు స్థానాలకు విపరీతంగా పోటీ నెలకొంది. ఆ ఆదృష్టం ఎవర్ని వరిస్తుందో అని నేతలంతా ఎదురుచూస్తున్నారు. మొత్తం 10 మందికి పైగానే ఉన్నట్టు టీడీపీలో చర్చ నడుస్తుంది. ఈసారి 'పెద్ద‌ల స‌భ‌'లో కూర్చునే అవ‌కాశం త‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌నే న‌మ్మ‌కంతో వీరంతా ఆశ‌లు పెట్టుకుంటు న్నారట‌. ఇక లాబీయింగ్‌ కూడా ప్రారంభించేశారు.

చాలా మందికి ఆశలు.....

ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌ని పోటీప‌డుతున్న వారి జాబితా చూసి అధినేత చంద్ర‌బాబులో ఆందోళ‌న మొద‌లైంది. ఇందులో మొద‌టిగా మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు పేరు వినిపిస్తోంది..! గవర్నరుగా అవ‌కాశం క‌ల్పిస్తార‌ని ఎంతో ఆశ ప‌డినా.. చివ‌ర‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో మోత్కుప‌ల్లి నిరాశ‌లో ఉన్నారు. ఊరించి ఉసూరుమ‌నిపించిన ఆయ‌న కు ఈసారి పెద్ద‌ల స‌భ‌లో బెర్త్ ఖాయ‌మ‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. తనను రాజ్యసభకు పంపాల ని చంద్రబాబుకు విన్నవించారని తెలుస్తుంది. తెలంగాణ‌లో పార్టీ నుంచి ఎంతోమంది వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీలోనే ఉంటూ పార్టీ త‌రపున బ‌ల‌మైన వాయిస్‌ను వినిపిస్తున్నాన‌ని ఆయ‌న చంద్ర‌బాబు వ‌ద్ద మొర‌పెట్టుకున్నార‌ట‌. ఇక ఎస్సీ కోటాలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జూపూడి ప్రభాకరరావు, వర్ల రామయ్య వంటి నేతలు తామ పేర్లు కూడా ప‌రిశీలించాల‌ని ఇప్పటికే అధినేత చంద్రబాబుకు చెప్పేశార‌ట‌.

కంభంపాటికి ఛాన్స్ ఉంటుందా?

ఇక ఇదే ఎస్సీ, లేడీ కోటాలో మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ లెక్క‌న ఎస్సీ కోటాలో చాలా పోటీ నెల‌కొంది. ఇక కేంద్ర మంత్రి సుజ‌నా చౌదరి వ‌ల్లే త‌న‌కు ఎంపీ ప‌ద‌వి ద‌క్కుండా పోయిందని కంభంపాటి రామ్మోహ‌న‌రావు ఎప్ప‌టినుంచో అసంతృప్తితో ఉన్నారు. మొన్న‌టివ‌ర‌కూ ఢిల్లీ వ్య‌వ‌హారాలు చూసినా ఎంపీ ద‌క్క‌లేద‌నే లోటు ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. అందుకే ఈసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌నే గ‌ట్టి యోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది! ఇటు రాయలసీమ నుంచి కూడా పోటీ గట్టిగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది! వీరిలో ప్ర‌ముఖంగా టీడీపీ సీనియర్ నేత, మంత్రి కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ పేరు వినిపిస్తోంది. బీసీ కోట నుంచి తన తమ్ముడిని ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని, కృష్ణమూర్తి విశ్వప్రయత్నాలు చేస్తున్నార‌ని సమాచారం.

కేఈ తమ్ముడు కూడా....

క‌ర్నూలు ఎంపీ టికెట్ ఆశించిన ప్ర‌భాక‌ర్‌కు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చి బుజ్జ‌గించారు. వచ్చే ఎన్నికల్లో తనను కర్నూల్ ఎంపీగా పోటీచేయిస్తాన‌ని బాబు గతంలో మాట ఇచ్చారట. తాజాగా వైసీపీ నుంచి టీడీపీకి మ‌ద్ద‌తు తెలుపు తున్న‌ఎంపీ బుట్టా రేణుకకు మళ్లీ అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇవ్వ‌డంతో.. తన తమ్ముడిని రాజ్యసభకు పంపాలని కేఈ కోరార‌ట‌. ఇక ఆర్థిక మంత్రి యనమల కూడా రాజ్యసభ సీటుపై కన్నేశారు. పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌నేది త‌న కోరిక అని ఇప్ప‌టికే చాలాసార్లు.. చంద్ర‌బాబుకు య‌న‌మ‌ల చెప్పిన విష‌యం తెలిసిందే! ఇక ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోన‌ని, వెళితే రాజ్య‌స‌భ‌కు వెళ‌తాన‌ని ఆయ‌న గ‌తంలోనూ స్ప‌ష్టంచేశారు.

యనమల పేరు ఖరారయినట్లేనా?

శాస‌న‌స‌భ‌లో వైసీపీని ధీటుగా ఎదుర్కొంటూ.. త‌న‌దైన వాగ్భాణాల‌తో ప్ర‌తిపక్షంపై ఎదురుదాడి చేస్తున్న ఆయ‌న్ను పెద్ద‌ల స‌భ‌కు పంప‌డం వ‌ల్ల కొంత లోటుగానే భావించినా.. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కూడా ఈ విష‌యంలో సానుకూలంగానే ఉన్నార‌ట‌. ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంప‌డం వ‌ల్ల టీడీపీకి పార్లమెంటులో పెద్దదిక్కుగా ఉంటుందని చంద్రబాబు వద్ద లోకేష్‌ ప్రస్తావించారని సమాచారం. ఇక సిట్టింగ్ ఎంపీ సీఎం.ర‌మేష్ ప‌ద‌వి త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. ఆయ‌న కూడా మ‌రోసారి త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఒక‌వేళ ఆ ఛాన్స్ లేని ప‌క్షంలో ర‌మేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఏర్పాట్ల‌లో ఉన్నారు. ఇక మ‌రి వీరిలో చంద్ర‌బాబు ఎవ‌రికి పెద్ద‌ల స‌భ‌కు అవ‌కాశం క‌ల్పిస్తారో వేచిచూడాల్సిందే!! వీరితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి ఆ అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచిచూడాల్సిందే!!

Similar News