ప్రభుత్వాల ప్రేక్షకపాత్ర ఎంతకాలం ఇలా?

Update: 2016-10-12 02:54 GMT

మార్పు అనేది సాంప్రదాయాలకు కూడా అవసరం. సాంప్రదాయం పేరుతో ఒక సమర్థించలేని పోకడ విచ్చలవిడిగా పెచ్చుమీరుతున్నప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే తప్పదు. సాంప్రదాయం పేరుతో ప్రజలు శాంతి భద్రతలు లేదా సామాజిక జీవన నియమనిబంధనలను తుంగలో తొక్కి చెలరేగితే.. ప్రభుత్వం అందులో ఎంటర్ కావాల్సిందే. సాంప్రదాయం పేరుతో జనం ఒకరిని ఒకరు చావబాదుకుంటూ ఉంటే.. అది వారి ఇచ్చానుసారం కొట్టుకుంటున్నారు కదా.. మనం అడ్డుకోగూడదు..అని మాట్లాడే ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వమో ప్రజలు ఆలోచించాలి.

అవును. దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల పండుగ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ గ్రామంలో రెండు వర్గాలకు చెందిన వారు విజయదశమి రోజున.. కర్రలతో కొట్టుకోవడం అనేది సాంప్రదాయం. విచ్చలవిడిగా వారు కొట్టుకుంటారు. ఈ ఏడాది జరిగిన ఈ ‘సాంప్రదాయపు పండుగ’లో దాదాపు 50 మంది వరకు కర్రల దెబ్బలకు బాగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చీకట్లో జరిగే ఈ కర్రల కొట్లాటకు వెలుగుల కోసం పెట్టుకున్న కాగడాల మంటలు అంటుకుని మరో 5 మంది వరకు గాయపడ్డారు. అంటే 55 మంది ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు.

ఏం వేడుక ఇది? ఏం సాంప్రదాయం ఇది? దీన్ని అడ్డుకోవడానికి దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి, మాట వినకుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి నిలువరించడానికి ప్రభుత్వానికి చేతకాకుండా పోవడం చాలా శోచనీయం.

ఉదాహరణకు.. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలలో దేవుడి పెళ్లి సందర్భంగా ప్రతి ఏటా కొన్ని వందల బాల్య వివాహాలు జరిగేవి. పరిసర గ్రామాల పేదలకు, నిమ్న వర్గాల వారందరికీ ఇదే పెద్ద పెళ్లి ముహూర్తం. దేవుడి పెళ్లి సమయానికి వస్తే ఆలయం వారు పుస్తెల తాడు కానుకగా ఇస్తారు.. దేవుడి పెళ్లి ముహూర్తానికి వారు కూడా బొట్టు కట్టేసుకుని వెళ్లిపోయే వారు. ఆ ముసుగులో అనేక బాల్య వివాహాలు జరిగేవి. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిచింది. బాల్యవివాహాలు జరగకుండా ఆపగలిగారు.

ఇక్కడ పెద్ద ఘోరమైన విషయం ఏంటంటే.. బాల్యవివాహాల మీద పోరాడుతున్నాం అంటూ.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ సంస్థలనుంచి కేంద్రం నుంచి భారీ మొత్తాల్లో నిధులు తీసుకుని బాల్యవివాహ వ్యతిరేక పోరాటం నడుపుతాయి. నిదులు పుష్కలంగా ఉంటాయి గనుక.. అలాంటి సామాజిక దురాచారాల మీద మాత్రం పోరాటం చేస్తాయి. అదే సమయంలో.. దేవరగట్టు కర్రల పోరాటం లాంటి దురాచారాలపై ప్రజలకు అవాహన కలిగించడానికి గానీ.. దాన్ని ఆపడానికి గానీ ఎవరూ ప్రయత్నించరు. ఎందుకంటే.. దీనికి నిధులిచ్చే సంస్థలు ఉండవు కాబట్టి.

ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం అనేది వారి చేతగాని తనానికి నిదర్శనం. ఒక సామాజిక దురాచారానికి బలై తన రాష్ట్రంలో 55 మంది ఇవాళ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిసినప్పుడు.. చంద్రబాబునాయుడులో సిగ్గు అనే భావన కలిగితే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా కోడిపందేల రూపేణా కొన్ని వేల కుటుంబాలు నిలువునా శిథిలమైపోయినా ఈ ప్రభుత్వాలు స్పందించవు. కనీసం ఆ కోడిపందేలను అనుమతించి.. నియమితమైన పందేలు పెట్టి ప్రజలు నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అయినా తమకు ఉన్నదని వారు భావించరు. ఒక్కరోజులో కటికదరిద్రులుగా మారిపోయిన వారికి కావలిస్తే చంద్రన్న కానుకగా రూపాయిబియ్యం ఇస్తారు. దేవరగట్టు లాంటి చోట్ల ఇలా కర్రలతో కొట్టుకుని గాయాలపాలౌతోంటే పట్టించుకోరు. కావలిస్తే.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయిస్తాం అంటారు. ఇలాంటి చైతన్యం లేని, స్వబుద్ధి లేని, సామాజిక దురాచారాలను అరికట్టాలనే బాధ్యతలేని ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదు.

Similar News