ప్రజలారా.. ఈ తిట్లు మొత్తం గుర్తుంచుకోగలరు!

Update: 2016-11-07 09:51 GMT

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందా? రాదా? అటు హోదా ఇవ్వవలసిన కేంద్రంలోని భాజపా నాయకులు మాత్రం హోదా వచ్చే అవకాశమే లేదని, అందుకే హోదాను మించిన ప్యాకేజీ ఇచ్చాం అని తెగేసి చెప్పేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని పాలకపక్షం ‘‘హోదా ఇస్తే మంచిదే.. కానీ ఇవ్వం అంటున్నారు గనుక.. వారు ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్నాం’’ అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే విపక్షాలు వైకాప లేదా జనసేన లాంటి పార్టీలు మాత్రం.. హోదా ఇచ్చి తీరాల్సిందేనని, హోదా ఇచ్చే వరకు మడమ తిప్పని పోరాటం సాగిస్తాం అని అంటున్నాయి. సభలు పెడుతున్నాయి. కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది.

అయితే జగన్ సభ పెట్టి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడంలేదంటూ ప్రభుత్వాన్ని చంద్రబాబును నిందించడం, రెండో రోజునుంచి తెలుగుదేశానికి చెందిన మంత్రులంతా క్యూకట్టి.. ఎడాపెడా జగన్ మీద తిట్ల దండకం లంకించుకోవడమూ, జగన్ నేరాలు, జైలుజీవితం తదితర పురాణాన్ని మొత్తం పారాయణం చేయడమూ ఎప్పడూ జరుగుతూ ఉన్నదే. జగన్ ఒక్క సభ పెట్టగానే.. దానికి కౌంటర్ ఇవ్వడానికి బోలెడు మంది మంత్రులు తయారవుతారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. జగన్‌కు ఢిల్లీ వెళ్లి మాట్లాడే ధైర్యం లేదని, మోదీ పేరు ప్రస్తావించాలంటే భయం అని , ప్రత్యేకహోదా పేరుతో జనాన్ని రెచ్చగొట్టి అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని, పోలవరం లాంటిది వేగంగా చేపడుతూ, పట్టిసీమ ద్వారా క్రిష్ణా నదికి నీళ్లు తెస్తే మాట మాత్రంగానైనా ప్రశంసించలేదని ఇలాంటి అధ్వానపు నాయకుడు జగన్ అని.. ఇంకా నానా మాటలు తిట్టేశారు. ఈ తిట్ల పర్వంలో ప్రస్తుతానికి మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు తమ వాటా పూర్తిచేశారు. మరింత మంది కూడా వచ్చి చేరే అవకాశం ఉంది.

అయితే ఈ తిట్లు మొత్తం ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరో రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అనంతపురంలో ప్రత్యేకహోదా సభ పెట్టబోతున్నారు. అచ్చంగా జగన్ సభ లాగానే అక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఆయన చంద్రబాబును, మోదీని మాత్రం పేర్లు ప్రస్తావించకుండా ఎంపీలను మాత్రం తిట్టిపోస్తారు. నిజానికి ఆయన కూడా పోలవరం లేదా పట్టిసీమ గురించి ఇవాళ్టిదాకా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక్క కామెంటయినా చేసింది లేదు.

మరి జనం గుర్తుంచుకుని పోల్చి చూసుకోవాల్సింది ఏంటంటే.. ఇవాళ జగన్ ను తిట్టిన తిట్లనే, రేపు పవన్ ను కూడా తిట్టడానికి ఈ తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటుందా? ఇద్దరు చేసేదీ ఒకటే పోరాటం అయినప్పుడు, వారిద్దరిదీ ఒకటే ఎజెండా అయినప్పుడు.. జగన్ ను మాత్రం తూర్పార పడుతూ.. పవన్ కల్యాణ్ ను దూషించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ చిలకపలుకులు పలకడంలో తెదేపా నాయకుల వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి.

ఆ మాటకొస్తే తెలుగుదేశ నాయకులు జగన్ చరిత్రను మొత్తం పక్కన పెట్టి.. ప్రత్యేకహోదా కోసం తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏమిటి? అనేది నిర్దిష్టంగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. డొంకతిరుగుడు దూషణలతో జగన్ మీద విరుచుకుపడడం ద్వారా రోజులు నెట్టేయవచ్చునని భ్రమల్లో బతుకుతున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని జనం గుర్తించి ఉండవచ్చు గాక.. కానీ, తెలుగుదేశం నాయకులు కూడా ఈ విషయంలో అంత స్వచ్ఛంగా ఏమాత్రం వ్యవహరించడం లేదని, వారివి కూడా గర్హనీయమైన ద్వంద్వప్రమాణాలే అని జనం గుర్తించకుండా ఉండరు!! ఆ సంగతి వారు తెలుసుకోవాలి.

Similar News