పోల‌వ‌రంపై బాబు ఆశ‌లు.. క‌థ కంచికేనా?

Update: 2017-11-09 11:30 GMT

ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కోటి ఆశ‌లు పెట్టుకున్న పోల‌వ‌రం బ‌హుళార్ధ సాధ‌క ప్రాజెక్టు విష‌యంలో పెద్ద బండ ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో దీనిని ప్ర‌త్యేకంగా పేర్కొని కేంద్ర‌మే పూర్తిగా నిర్మిస్తున్నంద‌ని స్ప‌ష్టం చేశారు. దీనికి అయ్యే ప్ర‌తి రూపాయీ కేంద్ర‌మే ఇస్తుంద‌ని కూడా పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రాజెక్టుగా కూడా డిక్లేర్ చేశారు. అయితే, ఈ ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబు.. 2018 చివ‌రి నాటికే దీనిని ఎలాగైనా పూర్తిచేసి 2019 ఎన్నిక‌ల నాటికి దీనిని చూపించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి సోమ‌వారం ఆయ‌న పోల‌వారంగా మార్చేసి.. ఎన్ని ప‌నులున్నా దీనిపై స‌మీక్షిస్తున్నారు.

నిధులు నీళ్లప్రాయంగా....

అంతేకాదు, అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను కూడా మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రాక‌పోయినా ఇప్ప‌టికే రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి రూ. 2800 కోట్ల‌ను అద‌నంగా ఖ‌ర్చు చేశారు. ఈ మొత్తం కేంద్రం నుంచి ఎప్పుడు వ‌స్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఇంత‌లా చంద్ర‌బాబు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఖంగారు ప‌డుతుంటే.. కేంద్రం మాత్రం రోజుకో కొత్త నిబంధ‌న‌ను తెర‌మీద‌కి తెస్తోంది. ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మొన్న‌టికి మొన్న కాంట్రాక్టు విష‌యంలో తెలెత్తిన గొడ‌వ స‌ర్దుమ‌ణ‌గ‌క ముందే.. తాజాగా కాఫ‌ర్ డ్యాం విష‌యంలో కేంద్రం యూట‌ర్న్ తీసుకుంది.

అంత హడావిడి ఎందుకు...?

పోల‌వ‌రానికి సంబంధించి కాఫ‌ర్ డ్యాం నిర్మాణ ప‌నుల‌ను అప్పుడే ప్రారంభించ‌వ‌ద్దంటూ.. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతేకాదు, అంత హ‌డావుడిగా కాఫ‌ర్ డ్యాంను ఎందుకు నిర్మిస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. అక్క‌డితో కూడా ఆగ‌కుండా కాఫ‌ర్ డ్యాం నిర్మాణం అవ‌స‌ర‌మో? కాదో? తేల్చాల‌ని, దీనికి ఒక క‌మిటీని కూడా వేస్తున్నామ‌ని పేర్కొంది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శి అమ‌ర్ జిత్ సింగ్ ఆదేశాల‌తో ఉన్న‌తాధికారులు రాష్ట్రానికి లేఖ రాశారు. దీంతో పోల‌వ‌రంకు కొత్త అడ్డంకులు ఏర్ప‌డ్డాయి.

అది అవరసరం లేదు.....

నిజానికి ప్రాజెక్టుకు కాఫ‌ర్ డ్యాం అవ‌స‌రం లేద‌ని కేంద్రం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రాన్ని ఆదేశించింది. కానీ, కాఫ‌ర్ డ్యాం పూర్త‌యితే, పోల‌వ‌రం స‌గానికి పైగా పూర్త‌యిన‌ట్టేన‌ని బాబు భావిస్తున్నారు. దీనికోసం విదేశాల నుంచి మిష‌న్లు కూడా తెప్పించారు. ఇంత‌లో ఇలా అస‌లు ఈ డ్యాంపై కేంద్ర యూట‌ర్న్ తీసుకోవ‌డం బాబుకు అగ్ని ప‌రీక్ష‌గానే త‌లెత్తింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి

Similar News