పోయెస్ లో.... బాస్ ఈజ్ బ్యాక్....

Update: 2017-02-15 14:30 GMT

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అటు జైలుకు బయలుదేరగానే ఆమె భర్త నటరాజన్ ఎంట్రీ ఇచ్చేశాడు. తమిళనాడు రాజకీయాలు గందరగోళంగా మారిన పరిస్థితుల్లోనూ నటరాజన్ జాడ కన్పించలేదు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావడం, శాసనసభా పక్ష నేతగా ఎన్నికవ్వడం వంటి ముఖ్యమైన ఘటనల్లోనూ నటరాజన్ లేరు. ఆయన పోయెస్ గార్డెన్ లోనూ ఉండటం లేదు. మూడు రోజులు శ్వాసకోశ వ్యాధితో బాధపడిన నటరాజన్ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చారని తెలిసింది.

కష్ట సమయంలో పత్తా లేని నటరాజన్...

అన్నాడీఎంకేలో చీలిక వచ్చి పన్నీర్ సెల్వం బయటకు వెళ్లి శశికళపై ఆరోపణలు చేస్తున్నా నటరాజన్ బయటకు రాలేదు. ఎమ్మెల్యేల క్యాంప్ వైపు కూడా నటరాజన్ తొంగి చూడలేదు. మంగళవారం రాత్రి శశికళ గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పోయెస్ గార్డెన్ కు వచ్చినప్పుడు ఆయన వచ్చారని తెలుస్తోంది. శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో నటరాజన్ మళ్లీ కన్పించడం అన్నాడీఎంకే వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయలలిత మరణించినప్పుడు మాత్రమే నటరాజన్ కన్పించారు. తర్వాత రెండు, మూడు సార్లు మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడారు. తర్వాత జరిగిన వరుస పరిణామాలలో మాత్రం ఆయన లేరు. శశికళ కావాలనే నటరాజన్ ను బయటకు పంపారని తెలుస్తోంది. నటరాజన్ అంటే జయలలితకు ఎంతమాత్రం పడేది కాదు. జయ కోసం శశికళ భర్తను కూడా వదులుకుంది. కొన్నేళ్లపాటు దూరంగానే ఉంది. 2011 లో జయలలిత నటరాజన్ అండ్ కోను పోయెస్ గార్డెన్ నుంచి గెంటి వేసిన తర్వాత ఆ ఛాయలకు కూడా నటరాజన్ రాలేదు.

పార్టీ కార్యకర్తల కోరిక మేరకే...

శశికళ బుధవారం బెంగళూరు జైలుకు బయలుదేరగానే నటరాజన్ మళ్లీ కన్పించారు. బెంగళూరు కోర్టు వద్దకు తాను కూడా వెళ్తున్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకే టీటీవీ దినకరన్, వెంకటేశ్ లకు పార్టీలో కీలకపదవులు అప్పగించినట్లు నటరాజన్ పేర్కొన్నారు. మొత్తం మీద ఇప్పడు పోయెస్ గార్డెన్ లో నటరాజన్ మరోసారి ప్రవేశించారన్నమాట. శశికళ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ఆయనే వెనకుండి నడిపిస్తారన్న ఊహాగానాలు తమిళనాడులో చెలరేగుతున్నాయి. అయితే అమ్మ ఎవరినైతే వద్దనుకుందో.... ఆమె మరణం తర్వాత వారంతా వచ్చి పార్టీపై పెత్తనం చెలాయిస్తున్నారని జయ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శశికళ వర్గం మాత్రం బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News