పాదయాత్రతో దుమ్ములేపుతున్న జగన్ ...!

Update: 2017-11-08 04:30 GMT

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర అంత ఆషామాషీగా లేదు. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ సాయంత్రం రచ్చబండ తో నేరుగా ప్రజలతో ముఖా ముఖీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇలా ఒక రోజులో మొత్తం అటు పార్టీ క్యాడర్ తో ఇటు ప్రజలతో బహుముఖంగా కనెక్ట్ అవుతూ ఆకర్షిస్తున్నారు వైసిపి అధినేత.

సూపర్ హిట్ గా నిలిచిన రచ్చబండ ...

జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. జగన్ చెప్పే ప్రతి జవాబుకి ఇచ్చే ప్రతి హామీకి జనం నుంచి భారీ రెస్పాన్స్ రావడం విశేషం. రైతులు , మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు ఇలా అన్ని వర్గాలు విపక్ష నేత ముందుకు వచ్చి తమ బాధలను రచ్చబండ సాక్షిగా చెప్పుకుంటున్నాయి.

నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ...

పేద ప్రజల గుండె చప్పుడు గా నిలిచి ప్రతి పేదవారి ఇంట ఫోటో గా వున్న తన తండ్రి బాటలో త్రికరణ శుద్ధిగా నడుచుకుంటా అని సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో జగన్ చెబుతున్నారు. నేను చనిపోతే నాన్న ఫోటో పక్కన నా ఫోటో మీ ఇంట్లో ఉండేలా ఏమి చేయాలో అన్ని చేస్తా అంటూ భావోద్వేగ ప్రసంగాలతో తన యాత్ర రక్తి కట్టిస్తున్నారు జగన్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, వృద్దులు, వికలాంగులకు పెన్షన్లు, రెండు రూపాయల కిలో బియ్యం, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ తో పేదల పాలిట పెన్నిధి అయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడిగా అంతకు మించి కసిగా చేస్తా అంటున్న జగన్ మాటలు జనం లోకి బాగా పోతున్నాయి.

Similar News