పవన్ తో కటీఫ్ కు భాజపా సిద్ధమే

Update: 2016-11-02 14:56 GMT

గత ఎన్నికల్లో మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అప్పటికే తాను సొంతంగా జనసేన పార్టీని స్థాపించినప్పటికీ... దానిని పూర్తిగా పక్కన పెట్టి.. మోడీ మరియు చంద్రబాబు ల కూటమికోసం ఆయన కష్టపడ్డారు. అయితే ఎన్నికల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పినందుకు ఆయన భాజపాకు చెందిన నాయకులను ఒక రేంజిలో తిట్టిపోస్తున్నారు. ఇదంతా మనం గమనిస్తున్నదే. అయితే భాజపా తరఫున స్పందన ఏంటన్నది ఇప్పటిదాకా తేలలేదు.

అయితే తాజాగా ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సిద్ధార్థ నాధ సింగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ పవన్ స్థాపించిన జనసేన పార్టీ , భాజపా కు ఎప్పుడూ మిత్రపక్షం కాదని తెగేసి చెప్పేశారు. కేవలం తమ పార్టీకి మద్దతుగా ఆయన గత ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహించారని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ తో తెగతెంపులకు , రాంరాం చెప్పడానికి తమకు సంకోచం ఏమీ లేదని, సిద్ధంగానే ఉన్నాం అని ఆయన ఈ సందర్భంగా సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్యనాయుడు, కామినేని శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు లాంటి వాళ్లంతా ఎంతో ఆచితూచి మాట్లాడుతున్నారు. అయితే గతంలో భాజపా ఎంపీల మీద పవన్ విమర్శలు రువ్వినప్పుడు కూడా సిద్ధార్థ నాధ్ సింగ్ తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలైతే ఏకంగా పవన్ కల్యాణ్ తో కటీఫ్ చెబుతున్నట్లే ఉన్నాయి.

పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలు, వచ్చే ఎన్నికల సమరాంగణం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూండడం, అక్కడ ఓటరుగా కూడా నమోదు కావడానికి సిద్ధం కావడం, పైగా ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన జట్టుకట్టే సూచన ప్రస్తుతానికి లేకపోవడం నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చి.. సిద్ధార్థనాధ్ ద్వారా మాట్లాడించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News