పవన్ కోర్కెలపై బాబు : ఒకటి ఎర్రజెండా మరొకటి పచ్చజెండా!

Update: 2016-10-16 11:15 GMT

భీమవరం వద్ద ఏర్పాటు అవుతున్న ఆక్వా ప్రాసెసింగ్ పార్క్ విషయంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్వరంతో హెచ్చరించిన నేపథ్యంలో 24 గంటల్లోనే దాని ఫలితం కనిపించింది. ఇదివరకు కూడా జనసేన తరఫున రెండు బహిరంగ సభలు పెట్టినప్పటికీ.. పవన్ కల్యాణ్ ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం మీదికి మళ్లలేదు. తొలిసారిగా రాష్ట్రప్రభుత్వ చర్యలను గర్హిస్తూ పవన్ పెట్టిన ప్రెస్ మీట్ ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చింది. పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్లలో చంద్రబాబు ఒక దానికి బేషరతుగా పచ్చజెండా ఊపేశారు. మరో కీలకమైన డిమాండును మాత్రం తోసి పుచ్చారు. ఇప్పుడు దీని పట్ల పవన్ కల్యాణ్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

వివరాల్లోకి వెళితే.. ఆక్వా పార్క్ వ్యవహారం కొన్ని రోజులుగా పతాక శీర్షికలకు ఎక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిమీద రైతులతో కలిసి స్పందించిన పవన్ కల్యాణ్ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. ‘ఈ ఆక్వా పార్కును ఈ చోటనుంచి సముద్రానికి మరింత దగ్గరగా తరలించడం ఒకటి కాగా, రెండోది – కాలుష్య నివారణ పరంగా ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయో లేదో పర్యవేక్షించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్నది. అయితే పవన్ కల్యాణ్ ఈ కమిటీకి హైకోర్టు న్యాయమూర్తుల నేతృత్వం ఉంటే బాగుంటుందని కూడా సూచించారు.

ఆ నేపథ్యంలో చంద్రబాబు అధికారులు, కలెక్టరు, నాయకులతో ఓ సమీక్ష నిర్వహించారు. ఈ డిమాండ్లలో ఆక్వా పార్క్ స్థలం అక్కడినుంచి తరలించడం అనేదానిని ముఖ్యమంత్రి తోసి పుచ్చారు. దీని ఏర్పాటుకు యాజమాన్యం ఇప్పటికే 25 కోట్లు ఖర్చు చేసినందున తరలింపు సాధ్యం కాదని తేల్చేశారు. అదే సమయంలో కాలుష్య నివారణ ఏర్పాట్ల పర్యవేక్షణకు మాత్రం స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టరు తదితరులతో కమిటీ వేశారు.

పవన్ కల్యాణ్ కూడా ఏకీభవించేలా.. పారిశ్రామికీకరణ అనేది ఉపాధి కల్పనకే చేపడుతున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఇక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనుకోవాలి. నిజానికి కలెక్టరు ఆధ్వర్యంలోని కమిటీ ఖచ్చితంగా , ఫ్యాక్టరీల ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తే చాలు.. ఫ్యాక్టరీల నుంచి కాలుష్యాలు పంటకాలువల్లోకి వెళ్లకుండా పద్ధతైన ఏర్పాట్లు జరుగుతాయి. అయితే వారందరూ సమానమైన చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Similar News