పల్నాడు బాబుకు సెంటిమెంటా?

Update: 2017-03-01 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంచెం సెంటిమెంట్ పిచ్చి పట్టుకున్నట్లుంది. పల్నాడు ప్రాంతం నుంచి ఏదైనా కార్యక్రమం చేపడితే అది విజయవంతమవుతుందని ఆయన భావిస్తున్నారు. గతంలో పల్నాడు నుంచే చంద్రబాబు ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. అది సక్సెస్ కావడంతో పల్నాడుకు...బాబుకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. తాజాగా చంద్రాబాబు పార్టీపై దృష్టి పెట్టారు. వలసలతో వచ్చి చేరిన ఎమ్మెల్యేలు ఒకవైపు, పదేళ్లు అధికారం లేక పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు పదవులు రాని మరికొందరు ఇలా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. జిల్లాస్థాయి సమావేశాలు పెట్టి చెప్పినా అవి చల్లార లేదు. ఇన్ ఛార్జి మంత్రులు వెళ్లి సంధి ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. దీంతో చంద్రబాబు పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు కొత్త మార్గం కనిపెట్టారు.

నియోజకవర్గ స్థాయిలో ...

ప్రతి నియోజకవర్గంలో నేతలందరూ కలిసి ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి నియోజకవర్గ ప్రజలను కూడా ఆహ్వానించాలి. వారందరితో నియోజకవర్గ సమస్యలపై చర్చించి ఒక నివేదికను రూపొందించి అధిష్టానానికి పంపాలి. ఇందుకు తొలుత పల్నాడునే ఎంపిక చేశారు చంద్రబాబు. పల్నాడు నియోజకవర్గంలో గురజాలలో తొలుత నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ఏపీలో తలపెట్టాలనుకున్నారు. అయితే రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించిన చంద్రబాబును అడ్డుకుంటామని ప్రజాసంఘాలు హెచ్చరించాయి. ఆ పరిస్థితుల్లో యరపతనేని ముందుకొచ్చి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను గురజాల నుంచే ప్రారంభింప చేశారు. అది విజయవంతం కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బాబు ముందుకెళుతున్నారు. వీటికి ప్రజాచైతన్య యాత్రగా నామకరణం చేశారు.

ఆ 21 చోట్ల కూడా....

ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు 21 మంది చేరడంతో అక్కడ తెలుగుతముళ్లు వేరు కుంపటి పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 21 నియోజకవర్గాలకు చంద్రబాబే స్వయంగా వెళతారని చెబుతున్నారు. తానే వెళ్లి అక్కడి నేతలకు సర్ది చెప్పి పార్టీలో విభేదాలను రూపుమాపాలని బాబు యోచిస్తున్నారు. ఇప్పటి వరకూ పదవులు రాని వారికి కూడా కొన్నిహామీలు కూడా ఇచ్చి వచ్చే ఎన్నికలకు ఏకతాటిపై వెళ్లాలన్నది బాబు అభిమతంగా కన్పిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Similar News