పన్నీర్ మూల్యం చెల్లించుకున్నారా?

Update: 2017-02-18 14:30 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యూహం బెడిసి కొట్టిందా? దాదాపు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం ఎందుకు ఎమ్మెల్యేలను ఆకట్టుకోలేక పోయారు? చిన్నమ్మ శిబిరాన్ని వదిలి తన చెంతకు ఎమ్మెల్యేలు క్యూ కడతారని ఎలా ఆశించారు? ఇదే ప్రశ్నలు పన్నీర్ వర్గీయుల నుంచి వస్తున్నాయి. శనివారం జరిగిన పళని విశ్వాస పరీక్షలో పళని వెంట 122 మంది ఎమ్మెల్యేలుంటే...పన్నీర్ సెల్వం వద్ద కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇదే ఇప్పుడు తమిళనాడులో చర్చకు దారితీసింది.

డీఎంకేతో సఖ్యతే దెబ్బతీసిందా?

పన్నీర్ సెల్వం శశికళను ఎదిరించి బయటకు వచ్చిన వెంటనే ఆయనకు జనాలు హారతులు పట్టారు. నాయకులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. పార్టీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు కూడా సెల్వం వెంటే ఉన్నామన్నారు. ఇవన్నీ చూసి పన్నీర్ కు ఎమ్మెల్యేలు కూడా అధికసంఖ్యలో మద్దతు పలుకుతారని భావించారు. కేవలం 11 మంది మాత్రమే పన్నీర్ వెంట నిలిచారు. క్యాంప్ రాజకీయాలే పన్నీర్ ను సీఎం కాకుండా చేశాయా? ఎంత క్యాంప్ పెడితే మాత్రం నిజంగా పన్నీర్ పై విశ్వాసముంటే ఎమ్మెల్యేలు ఎప్పుడో వచ్చేవారంటున్నారు విశ్లేషకులు. పన్నీర్ చేసిన తప్పుటడుగులే ఆయనకు ఈ స్థితికి తెచ్చాయంటున్నారు. వాస్తవానికి అన్నాడీఎంకే, డీఎంకే బద్ధ శత్రువులు. తమిళనాడు రాజకీయాలు తెలిసిన వారికెవరికైనా తెలుస్తోంది. ఉప్పు, నిప్పుగా ఉండే డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యర్ధులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటారు. జయలలిత, కరుణానిధి హయాంలో ఇది మరింత ఎక్కువైంది. శాసనసభలో జయలలిత చీరలాగితే... వెనువెంటనే వచ్చిన జయ కరుణానిధిని అరెస్ట్ చేసి పారేశారు. అంత కక్షలతో కూడిన పార్టీల్లో కేవలం ముఖ్య నేతలే కాదు. కార్యకర్తలు కూడా అదే రేంజ్ లో ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతూనే ఉంటారు. కేసులకూ భయపడరు. తమ నేత ఏదంటే అది.

శశి ఆరోపణల్లో నిజమెంత?

అటువంటి తమిళనాడులో డీఎంకే తో సఖ్యతగా పన్నీర్ మెలిగాడన్నది ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. తొలి నుంచి శశికళ ఇదే విషయాన్ని ప్రతి చోటా ప్రస్తావిస్తూ వచ్చారు. డీఎంకే స్టాలిన్ కూడా పన్నీర్ వైపు మొగ్గు చూపడంతో శశి ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు. బద్ధ శత్రువైన డీఎంకేతో చేతులు కలపడాన్ని ఎమ్మెల్యేలు కూడా తప్పుపడుతున్నారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్ని రోజులు పన్నీర్ రాజ్యమేలుదామనుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. పొట్టలో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా స్టాలిన్, పన్నీర్ వ్యవహారముందని ఎద్దేవా కూడా చేస్తున్నారు కొందరు. డీఎంకే తో సఖ్యతగా మెలగడం వల్లనే పన్నీర్ కు ఎమ్మెల్యేలు మద్దతు పలకలేదని తెలుస్తోంది. మొత్తం మీద పన్నీర్ తప్పటడుగు తగిన మూల్యం చెల్లించుకున్నారంటున్నారు పళనిస్వామి వర్గీయులు.

Similar News