నోటెత్తిన రాజకీయం (ఫైనాన్సెస్ వెర్సస్ పాలిటిక్స్)

Update: 2016-11-15 17:17 GMT

మనిషి పొలిటికల్ యానిమల్...అందులోనూ ప్రజాస్వామ్య విధానంలో బహుళ రాజకీయవ్యవస్థ నెలకొని ఉన్న దేశంలో సామాజిక, ఆర్థిక జీవనమూ రాజకీయాలూ అవిభాజ్యం. ఒకదానికొకటి విడదీయలేనివి. అందుకే వెయ్యి, అయిదువందల రూపాయల చట్టబద్ధ చెల్లుబాటును ఉపసంహరించిన తర్వాత దేశంలో సాగుతున్న రాజకీయాలు చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఈ నిర్ణయం సామాన్యునికి మంచిదా? చెడ్డదా? అన్న అంశం కంటే అధికార, విపక్షాల్లో ఎవరికెంతమేరకు ఉపయోగపడుతుందన్నదే నేడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

విధానపరమైన ఈ ప్రక్రియ వల్ల నల్లధనం ఎంత బయటికి వస్తుందో తెలియదు కానీ అధికార ఎన్డీయే , ప్రత్యేకించి ప్రధాని మోదీ ప్రతిష్ఠ ఎంత పెరుగుతుందన్నదే బీజేపీ నేతలకు ఇప్పుడొక కొలబద్ద. మధ్యతరగతి మామూలు మానవుడు ఎన్ని తిప్పలు పడతాడో అదే ప్రాతిపదికగా విపక్షాలకు ఎంత ప్రయోజనం చేకూరుతుందన్నదే ప్రతిపక్షాలకు లెక్క. మధ్యలో సగటు మనిషి నలిగిపోతున్నాడు ...

ఆర్థిక కోణాలు ఆసరాగా రంజైన రాజకీయం పసందుగా సాగిపోతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం తలుపుతడితే లంచం..మునిసిపల్ కార్యాలయానికి పర్మిషన్ పెడితే లంచం..ఇల్లు కొనాలన్నా ,అమ్మాలన్నా ..బిల్డింగ్ కట్టాలన్నా..కూల్చాలన్నా ...దేనికైనా ఒక రేటు ..అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లుగా లంచమిస్తేనే పనిచేస్తున్న సిబ్బంది కలగలిసి కొన్నేళ్లుగా ..కొన్ని దశాబ్దాలుగా మొత్తం వ్యవస్థలో మామూలిస్తే తప్పేంటి? అన్నంత మామూలుగా మారిపోయింది అవినీతి. లక్షల కోట్ల నల్లధనంగా పేరుకుపోయింది. వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో 90 శాతం నగదు చెలామణి చేస్తున్న దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. దీని కారణంగానే నల్లధనం కూడా లెక్కల్లోకి రాని మొత్తాల్లోనూ, ఆస్తుల రూపంలోనూ పోగుపడిపోతోంది. ఇది ఒకరకంగా రేట్లు పెరిగిపోవడానికి దారితీస్తోంది.

అక్రమంగా వచ్చిన నిధులను వినియోగ వస్తువులు,ఆస్తుల రూపంలోకి మార్చడానికి నల్లకుబేరులు చేసే ప్రయత్నాల్లో ద్రవ్బోల్బణం ఒక అంకం మాత్రమే. డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెంచడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి వన్నీ బ్లాక్ మనీ పెరగడంలో భాగాలే. వేళ్లూనుకుపోయిన ఈ దురవస్థను తప్పించడానికి చేతులు కలపాల్సిన రాజకీయపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఓట్ల ప్రయోజనాలు నొల్లుకునే యావలో పడిపోవడంతో వ్యవస్థ గాడి తప్పుతోంది. బ్లాక్ మనీ పట్ల సామాన్యుల్లో ఉన్న ఆగ్రహం, అసూయలను మొత్తంగా తనకు అనుకూలంగా చేసుకోవాలనే ఎత్తుగడతో ప్రధాని మోదీ ఏ రాజకీయ పక్షంతోనూ నామమాత్రంగా కూడా పరిష్కారమార్గాలపై చర్చించకుండా పిడుగుపాటున పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి నల్ల ధనం తీసుకురావడంలో ఎదురవుతున్న వైఫల్యాన్ని కప్పిపుచ్చడం, అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రచార లబ్ధి పొందడం కూడా ఇందులోని ఉద్దేశమనేది విమర్శకుల విశ్లేషణ.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ఎన్నికల్లోనూ సామాన్యుడి సానుభూతిని పొందవచ్చనే వ్యూహమూ దాగి ఉందంటున్నారు. దేశంలో మొత్తం గా 17.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు చెలామణిలో ఉండగా. అందులో 15 లక్షల కోట్ల రూపాయల మేరకు వెయ్యి, అయిదువందల రూపాయల విలువైన నోట్ల రూపంలోనే ఉన్నాయనేది అంచనా. ప్రస్తుతం 5.3 లక్షల కోట్ల ద్రవ్యలోటుతో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ మనది. మొత్తం దేశీయోత్పత్తిలో 3.5 శాతం మేరకు ఈ లోటు ఉంటోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనం, లెక్కలు చెప్పని నిధుల రూపంలో నగదుగా ఉన్న సొమ్ము తిరిగి బ్యాంకులకు చేరడం కష్టమనే భావన ఉంది. అందువల్ల 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల మేరకు వెయ్యి, అయిదు వందల రూపాయల రూపంలోని సొమ్ము తిరిగి బ్యాంకులకు చేరదనే భావన ఉంది. ఇదే జరిగితే డిసెంబరు తర్వాత రిజర్వు బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు మిగిలినట్లే లెక్క. దీనివల్ల ద్రవ్య లోటు తగ్గుతుంది. ఇది స్థూలంగా ఆర్థిక నిపుణుల అంచనా.

నల్లధనం తో తులతూగిన వారిని కొట్టేశామన్న ప్రచారం ప్రజల్లోకి వెళితే లక్షల కోట్ల విలువైన ప్రచారం ..రాజకీయ మద్దతు కూడగట్టవచ్చనేది కేంద్రంలోని అధికార పక్షం భావన. అయితే గత వారం రోజులుగా రోడ్డెక్కి పనులు మానుకొని బ్యాంకుల్లో తాము దాచుకున్న స్వార్జితమైన డబ్బుని తీసుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని పెచ్చరిల్ల చేసి వచ్చే ఎన్నికల వరకూ దీనిని కొనసాగించడమెలా? అన్నదే విపక్షాల యోచన. అందుకే రాహుల్ గాంధీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ల వరకూ ఒకే గళం, ఒకే స్వరం వినిపిస్తున్న అరుదైన ఘట్టం ఆవిష్కతమవుతోంది. అసలు లక్ష్యం అటకెక్కుతుంటే ..మరో వైపు ప్రధాని ఎమోషనల్ ప్రసంగంతో ఈ నల్ల కాసురుల నుంచి తన ప్రాణాలకే ముప్పు ఉందంటూ సానుభూతి చూరగొనే యత్నం చేయడం మరో మలుపు. తనకు యాభై రోజుల వ్యవధి ఇస్తే... చేసి చూపిస్తానని తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమంటున్నారు ప్రధాని. మరి ఈ రెండు నెలలూ ఎక్కే బ్యాంకు, దిగే ఎటీఎం అన్నట్లుగా తమ బతుకు దినదినగండంగా గడవాల్సిందేనా? అని వాపోతున్నాడు క్యూ లో నిలుచున్న సగటు భారతీయుడు. ఇంత గందరగోళం చోటు చేసుకుంటున్నా...అసలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పి సంస్కరణ పథంలో ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ విషయంపై నోరే మెదపడం లేదు. అదే కొసమెరుపు.

Similar News