నోటు దిస్ పాయింట్ : అరాచకాలకు అనేక మార్గాలు

Update: 2016-11-19 17:36 GMT

ఒకవైపు దేశవ్యాప్తంగా జనం విచ్చలవిడిగా నోటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. నల్లధనం నియంత్రణ కోసం జరుగుతున్న ప్రయత్నమే ఇది అనే స్పృహతో మోదీ సర్కారును దూషించడానికి మనసు రాకపోయినా.. కష్టాలు తగ్గిస్తే చాలునంటూ.. వారి పాట్లు వారు పడుతున్నారు. ఒకవైపు పరిస్థితులు ఇలా ఉంటే.. ఈ నోట్ల మార్పిడి మరియు నగదు డిపాజిట్లు ఇత్యాది నోటు వ్యవహారాలకు సంబంధించి.. అనేక అరాచకాలు కూడా విచ్చలవిడిగా చోటు చేసుకుంటున్నాయి.

ప్రభుత్వాలే కొన్ని అరాచక మార్గాలకు స్వయంగా తలుపులు తీసే ప్రయత్నంలోనూ ఉండడం విశేషం. చాలా అరాచకాలను ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి.

- గృహిణులు, చిన్న వ్యాపారులు, కార్మికులు ఇత్యాది రంగాల్లోని వారు ఒక్కో అకౌంటులో 2.5 లక్షలు వేసుకుంటే పట్టించుకునేది ఉండదన్న కేంద్రం మాటతో జనం దాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. అడ్డగోలుగా కమిషన్లు తీసుకుంటూ.. తమ అకౌంట్లలో నగదు జమ చేసుకుంటున్నారు.

- కొత్త మార్గాలు కనుగొంటున్న అక్రమార్కులు.. చాలా మందికి ఉన్న బ్యాంకు గోల్డ్ లోన్ మొత్తాలను నల్ల కుబేరులే.. ఒక్కసారిగా సొమ్ములిచ్చి క్లియర్ చేసేస్తున్నారు. ఇచ్చిన మొత్తంలో కొంత కమిషన్ గా తీసుకుని మిగిలిన దానిని వడ్డీలేని అప్పుగా నిదానంగా తీర్చమని అడుగుతున్నారు.

- ఇవిలా ఉండగా ఆర్టీసీలో మరో తరహా మోసం జరుగుతోంది. ఆర్టీసీకి ప్రతిరోజూ చాలా పెద్ద మొత్తాల్లో చిల్లర నోట్లు వచ్చి చేరుతూ ఉంటాయి. అయితే పైస్థాయిలో ఉండే కొందరు అధికారులు 100, 50ల వంటి నోట్లను ప్రతిరోజూ చాలా పెద్ద సంఖ్యలో మార్పిడిచేసేస్తూ.. వాటి స్థానంలో రద్దయిన నోట్లను పెట్టేస్తూ లబ్ధి పొందుతున్నారని కూడా తెలుస్తోంది.

- ఆలయాల్లో కూడా ఇలాంటి దందాలు నడుస్తున్నాయి. ఆలయ టికెట్లు, ఇత్యాది రూపేణా వచ్చే సొమ్ములో చెల్లుబాటు అయ్యే నోట్లను బయటకు తరలించే అదే మొత్తానికి రద్దయిన నోట్లను రీప్లేస్ చేసేసి.. అనుచిత రీతిలో లబ్ధి పొందుతున్నారని కూడా తెలుస్తోంది.

- సహకార బ్యాంకుల్లో డిపాజిట్లకు అనుమతి కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే జరిగితే లెక్కా పక్కా లేకుండా విచ్చలవిడిగా రైతుల పేరిట వారి ఖాతాల్లో నగదు వేసుకోడానికి వీలవుతుంది.

- డబ్బు మార్పిడిదందాలు సాగించడంలో బయటకు వస్తున్న వక్రమార్గాలు కొన్ని మాత్రమే.. అలాగే లోలోపల జరిగిపోతున్న వ్యవహారాలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవి అనూహ్యంగానూ, గుట్టుచప్పుడు కాకుండానూ సాగిపోతున్నాయని పలువురు అంటున్నారు.

Similar News