నేలరాలిన అరుణతార

Update: 2016-11-27 09:45 GMT

"మీరు మాకు కేవలం 90 మైళ్ళ దూరంలో వున్నారని గుర్తుంచుకోండి. కంట్లో నలుసులాగ వున్న క్యూబా కి నిక్సన్ హెచ్చరిక.

మేము మీకు 90 మైళ్ళ దూరంలో వున్నామని మాకు గుర్తుంది కాని, మీరు కూడా మాకు 90 మైళ్ళ దూరంలోనే వున్నారన్న విషయం మీరు కూడా గుర్తుంచుకుంటే మంచిది. --కాస్ట్రో రిటార్ట్."

పైన పేర్కొన్న మాటల తూటాలు కాస్ట్రో యొక్క ధీరత్వానికి ఒక మచ్చుతునక మాత్రమే. పెద్ద సామ్రాజ్యాన్ని చిన్న గెరిల్లా సైన్యం తో మట్టికరిపించిన గొప్ప యుద్ధ వ్యూహ నిపుణుడు. అర్థ శతాబ్దికి పైగా ఏక చత్రాదిపత్యంగా, ప్రజారంజకంగా పాలించిన నాయకుడు. ఫ్లోరిడా తీరానికి కేవలం 90 మైళ్ళ దూరంలోనే వున్నా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, కమ్యునిస్ట్ పాలనను కొనసాగించగలిగిన చతురుడు. తనను గద్దె దింపడానికి లేదా తుదముట్టించడానికి అమెరికా సి. ఐ. ఎ. ద్వారా నిరంతరంగా చేసిన లెక్కలేనన్ని ప్రయత్నాలను భగ్నం చేసిన మేధావి కాస్ట్రో.

కాస్ట్రో వృత్తి రీత్యా లాయర్. ప్రజా కంటకం గా పాలిస్తున్న బటిస్టా ని గద్దె దింపడానికి చేసిన చిన్న ప్రయత్నం విఫలమవడంతో 1953 లో జైలు పాలయ్యాడు. సంవత్సరం తర్వాత విడుదలైన కాస్ట్రో చేగువేరా ని కలవడానికి మెక్సికో వెళ్ళాడు. అర్జంటీనా వీరుడైన చేగువేరా వృత్తి రీత్యా డాక్టర్. అమెరికా క్యాపిటలిస్ట్ విధానానికి భద్ధ శత్రువైన చేగువేరా అప్పటికే లాటిన్ అమెరికా దేశాలని అమెరికా కబంధహస్తాల నుంచి విడిపించడానికి దేశ దేశాలు తిరుగుతూ పోరాటం చేస్తున్నాడు. లాయరు, డాక్టరు ఒక్కటయ్యారు. వారికి రవుల్ కాస్ట్రో (ఫిదెల్ సోదరుడు, ప్రస్తుత క్యూబా అద్యక్షుడు ) తోడయ్యాడు. ముగ్గురు కలిసి బటిస్టా మీద దండయాత్ర ప్రకటించారు. మొదటి ప్రయత్నం లోనే పెద్ద ఎదురుదెబ్బ. అమెరికా అండదండలున్న బటిస్టా సైన్యం 70 మందికి పైగా కాస్ట్రో మద్దతుదారులని తుదముట్టించగా కేవలం 10 మంది మిగిలారు. తరువాత యుద్ధ తంత్రాన్ని మార్చి గెరిల్లా పద్దతుల్లో ఆరితేరిన చేగువేరా పర్యవేక్షణ లో పదె పదె గెరిల్లా దాడులు చేశారు. చివరికి 1959 లో బటిస్టా దేశం వదిలి పారిపోవడం ద్వారా హవానా ఫిదెల్ కాస్ట్రో పరమయ్యింది.

అధికారం చేజిక్కగానే విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకొచ్చాడు. భూ గరిష్ట పరిమితి ప్రకటించి మిగిలిన భూమిని జాతీయం చేశాడు. రష్యాతో సహజంగానే ధ్రుఢమైన స్నేహం కుదిరింది. మొదట్లో అమెరికాతో బాగానే వున్నా, రష్యాతో స్నేహం మరియూ కమ్యునిస్ట్ విధానాలని అవలంబించడం అమెరికాకి నచ్చలేదు. అధికారం చేపట్టగానే అమెరికా పర్యటనకు వచ్చినా, అప్పటి అద్యక్షుడు ఐసెన్హోవర్ కలవకుండా అవమానించాడు. కాస్ట్రో కేవలం వుపాధ్యక్షుడు నిక్సన్ ని కలిసి వెళ్ళిపోయాడు. ఆస్తులన్ని జాతీయం చేయడం వల్ల ధనవంతులంతా ఫ్లొరిడా కి వలస వెళ్ళిపోయారు. రష్య నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకొన్నాడు. కానీ అప్పటికే అమెరికన్ కంపనీల ఆధ్వర్యంలో నడుస్తున్న రిఫైనరీలు దాన్ని శుద్ధి చేయడానికి నిరాకరించాయి. దీనితో ఆ రిఫైనరీలను జాతీయం చేసేశాడు. ఈ చర్యలన్నీ అమెరికాకు సహజంగానే కంటగింపుగా మారాయి. క్యూబాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు.

కాస్ట్రో అధికారం చేపట్టేనాటికి క్యూబాలో అక్ష్యరాస్యత చాలా తక్కువగా వుండేది. 1961 లో మొత్తం యూనివర్సిటిలన్నిటినీ రద్దు చేసాడు. అందరు అధ్యాపకులనీ పల్లెటూళ్ళకి పంపాడు. రెండేళ్ళలోనే 100% అక్ష్యరాస్యత సాధించాడు. విద్య మరియూ వైద్యం ప్రజల ప్రాధమిక హక్కు అని బలంగా నమ్మేవాడు. ప్రస్తుతం క్యూబాలో వైద్య వ్యవస్త ప్రపంచానికే ఆదర్శవంతమైన స్తాయిలో వుంది. తల నొప్పి దగ్గరనుంచి గుండె ఆపరేషన్ వరకూ అన్నీ వుచితం. అసలు అవసరమైనంతమంది డాక్టర్లు లేని స్థితి నుంచి, ప్రపంచంలో ఏ మూల విపత్తు వచ్చినా పెద్ద ఎత్తున దాక్టర్లని సహాయం కోసం పంపే స్థితికి తెచ్చాడు. అగ్ర రాజ్యమైన అమెరికాతో సరిసమానంగా సగటు జీవనకాలాన్ని తీసుకురాగలిగాడు. అమెరికా ఆంక్షల వల్ల అభివృద్ధి మందగించినా దేశాన్ని స్వయం సమృద్ధిగా చేయాలన్న సంకల్పానికి ఒక విధంగా ఆ ఆంక్షలే దోహదం చేశాయి.

కాస్ట్రో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో అమెరికా తనని గద్దె దింపడానికి చాలా విధాలే ప్రయత్నించింది. విభిన్న వర్గాలని రెచ్చగొట్టి వారికి ధన, ఆయుధ సహాయం చేయడం ద్వారా తిరుగుబాటు తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనితో ఆక్రమణకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. 1962 లో అమెరికా నిఘా విమానాలు, క్యూబా లో రష్యా అణు క్షిపణులని మొహరించడానికి చేస్తున్న ప్రయత్నాలని కనిపెట్టాయి. క్యూబా దగ్గర అణ్వాయుధాలు వుంటె గనుక అమెరికాకి పక్కలో బల్లెం వున్నట్లే. క్యూబా మీద భవిష్యత్తులో ఎన్నడూ దండెత్తను అనే ఒడంబడిక చేసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించగలిగింది. కానీ పరోక్షంగా కాస్ట్రోని అంతమొందించాలనే కుట్రలు సి. ఐ. ఎ. ద్వారా కొనసాగించింది. స్నైపర్ రైఫిల్స్ తో కాల్చడం దగ్గరనుంచి, కాస్ట్రో కాల్చే సిగార్స్ లో విషం కలపడం వరకూ దాదాపూ 600 సార్లు కాస్ట్రో మీద హత్యా యత్నాలు జరిగాయి. కాస్ట్రో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కేవలం 20 మందే వుంటారు గాని, వాళ్ళు శిక్షణ లో ఆరితేరిన, కాస్ట్రో కోసం ప్రాణాలను సైతం లెక్కచేయనివారు. వాళ్ళు ఈ హత్యా యత్నాలనన్నింటినీ విఫలం చేయగలిగారు.

కాస్ట్రో ప్రపంచ వ్యప్తంగా నాయకులతో ధ్రుడమైన సంభందాలను కొనసాగించాడు. గెరిల్లా పోరాటంలో ముందుండి నడిపించిన చేగువేరాని తన మంత్రివర్గం లోకి తీసుకొని గౌరవం కల్పించాడు. కానీ నిత్య పొరాట యోధుడైన చేగువేరా, తను క్యూబాకి వచ్చిన పని అయిపొయిందని, తన అవసరం ఇక్కడ లేదని, బొలీవియా పోరాటంలో సహాయ పడడానికి వెళ్ళిపోయాడు. బొలీవియాలో వుండగానే సి.ఐ.ఎ. పన్నిన వుచ్చులో చిక్కుకొని మరణించాడు. వెనుజులా సోషలిస్ట్ నాయకుడు హ్యూగో చావెజ్, కాస్ట్రోకి మద్దతుదారుడిగా వుండేవాడు. తన అంతిమ దశలో రెండు సార్లు క్యాన్సర్ శస్త్ర చికిత్చ కోసం క్యూబా వచ్చాడు. చావెజ్ కి క్యాన్సర్ రావడానికి కూడా సి.ఐ.ఎ చేపించిన ఇంజెక్షన్ కారణమని నమ్మే వాళ్ళు చాలామంది వున్నారు. అలీన దేశాలన్నింటితో మంచి సంభందాలను కలిగివుండేవాడు. జవహర్లాల్ నెహ్రు తో కాస్ట్రో కి మంచి సంభందాలు వుండేవి. 1960 లో యు.ఎన్. జనరల్ అస్సెంబ్లి సమావేశాలకు న్యూ యార్క్ కి వచ్చినప్పుడు, కాస్ట్రో మొదట 5 స్టార్ హోటల్ షెల్బుర్నె లో విడిది చేశారు. కానీ తనను అగౌరవ పరిచారనే కారణంతో పేదవాళ్ళు నివాసముండె హార్లెం లోని హోటల్ థెరెసా కి తన విడిదిని మార్చాడు. అప్పుడు కాస్ట్రో ని పరామర్శించడానికి వెళ్ళిన మొదటి నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఇందిరా గాంధీని కూడా కాస్ట్రో తన సోదరి గా భావించేవాడు.

లెనిన్, మావో ల స్థాయికి చెందిన గొప్ప నాయకుడు ఫిదెల్ కాస్ట్రో. ఆంధ్ర ప్రదేశ్ కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన, ఒక కోటి మత్రమే జనాభా కలిగిన క్యూబాను ప్రపంచ పటంలో సమున్నతంగా నిలపడంలో కాస్ట్రొ కృషి మరువలేనిది. తన 90 వ యేట నిన్న (నవంబర్ 26, 2016, శనివారం 03:29 జి యం టి) అనారొగ్యంతో మరణించారు. ఈ సంధర్భంగా కాస్ట్రో ని గుర్తుచేసుకొంటూ తెలుగు పోస్ట్ ఘన నివాళి.

-- స్పందన

Similar News