నిర్లిప్తతే మోదీ మంత్రం అవుతుందా?

Update: 2016-11-16 04:47 GMT

మామూలుగా అయితే నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకుంటూ ఉంటే ఆ ప్రభుత్వానికి చాలా కీర్తి ప్రతిష్టలు దక్కాలి. కానీ.. ఈ విషయంలో ఎలాంటి సమాచారం ముందే బయటకు పొక్కకుండా, అప్రమత్తంగా మరియు ఆకస్మికంగా మోదీచేయడం వలన జనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే.. మోదీ ప్రభుత్వానికి కూడా కీర్తి దక్కే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని విపక్షాలు ఎలా సహించగలుగుతాయి. అందుకే.. ‘జనం బాధలు పడుతున్నారు’ అనే ఒక తాత్కాలికమైన కష్టాన్ని పట్టుకుని వీలైనంత ఎక్కువ రాద్ధాంతం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ ఆరాటపడుతున్నాయి. అనుకోకుండా ఇదే సమయానికి కలిసి వచ్చిన పార్లమెంటు శీతాకాల సమావేశాలనే వేదికగా మార్చుకుని.. రచ్చరచ్చ చేసేయడానికి ముచ్చట పడుతున్నాయి. పార్లమెంటు మొత్తం విపక్షాల నోటు ఆందోళనలతోనే గడచిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

అయితే విపక్షాల ఆందోళనలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొనబోతున్నది. ఈ గండాన్ని ఎలా దాటబోతున్నది అనేది చాలా కీలకం. ఇప్పటికే మోదీ ఈ విషయంలో సూచన ప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. నోట్ల మార్పిడి విషయంలో, నల్లధనం కట్టడి చేసే విషయంలో ప్రభుత్వ చర్యలపై విపక్షాలు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చేశారు.

విపక్షాల దూకుడు పట్ల మోదీ సర్కారు సభలో కూడా అదే వ్యూహాన్ని అనుసరించేలా కనిపిస్తోంది. విపక్షాలు ఎన్ని మాట్లాడినా సరే.. మోదీ సర్కారు మౌనంగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సర్కారు వ్యూహం ఒక్కటే కనిపిస్తోంది. ఇప్పటికే జనం కష్టాల విషయంలో నివారణకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న అనేకానేక చర్యల ఫలితంగా ఒకటి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పరిస్థితులు కొంత మేర చక్కబడతాయి. విపక్షాలు మహా అయితే ఈ రెండు రోజులూ యాగీ చేస్తాయని, ఆలోగా జనానికే కష్టాలు తీరిపోయాక.. విపక్షాల అరుపులకు విలువ ఉండదని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వారి విమర్శల పట్ల నిర్లిప్తత, మౌనం పాటిస్తూ.. అదే సమయంలో నోట్ల విషయంలో తాము తీసుకుంటున్న చర్యలు సత్వరం అమలయ్యే ఏర్పాట్లపై దృష్టి పెడితే చాలు, అంతా సర్దుకుంటుందని సర్కారు అనుకుంటోంది.

Similar News