నిజమేనా.... బెదిరించారా......?

Update: 2017-02-17 21:00 GMT

సరిగ్గా వారం రోజుల క్రితం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండే ఈ ఎన్నికల గురించి ఉమ్మడి రాష్ట్రంలో వార్తలు తెగ వచ్చేవి.... ప్రభుత్వాల పాలనా దక్షతకు ఉద్యోగులే రిఫరెండంలా పనిచేసేవాళ్లు. అలాంటి కీలకమైన ఎన్నికలు గత వారం జరిగాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి అమరావతిలో జరిగిన ఈ ఎన్నికల గురించి పత్రికలు.. కూడా పెద్దగా పాఠకులకు తెలియనివ్వలేదు. నిజమేమిటో కాని ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఆశీస్సులున్న వర్గమే గెలుపొందింది. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమి లేదు కాని ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడమే పెద్ద ఆశ్చర్యం..... కేవలం కొన్ని వందల మంది ఉద్యోగులు ఉన్న సంఘానికి సంబంధించిన ఎన్నికల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఏపీలోని వెలగపూడి సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు ఈ నెల 9న జరిగాయి. అధ్యక్ష, కార్యవర్గంలో 9 పోస్టులకు 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. 1,268 మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ.,రాజ్‌భవన్‌ ఉద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వెంకట రామిరెడ్డి వర్సెస్ మురళీకృష్ణల మధ్య జరిగిన పోటీలో మురళీకృష్ణ ప్యానల్ గెలిచింది. ఇంతవరకు ఏ గొడవ లేకపోయినా ఎన్నికల్ని ఏకగ్రీవం చేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారనే వార్తలే సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ వర్గాన్ని పోటీ నుంచి తప్పుకోవాలని పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిందట.... అయితే నామినేషన్లు పూర్తయ్యాక పోటీ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో తనకు ఇబ్బంది కలుగుతుందని బరిలో నిలిచిన ఓ వర్గం విరమించేందుకు ససేమిరా అందట...అయితే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా..., కనీసం తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదని ముఖ్య నేత హెచ్చరించడంతో ఉద్యోగులు హతాశులయ్యారట.

ఎన్నికల్లో ఓ వర్గాన్ని పోటీ నుంచి తప్పించే క్రమంలో తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో పోటీ చేసిన వాళ్లు బిక్కచచ్చిపోయారట.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న ఓ నాయకుడికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందని తీవ్ర స్వరంతో ముఖ్యనేత హెచ్చరించడంతో ఉద్యోగులు చివరి సమయంలో అటు పోటీ నుంచి తప్పుకోలేక., ఇటు ప్రచారం చేసుకోలేక నలిగిపోయారట. చివరకు తాము పోటీ నుంచి విరమించే పరిస్థితి లేనందున ఏకగ్రీవం చేసేందుకు సహకరిస్తామని లొంగిపోవాల్సి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్ని మీడియాకు తెలిసినా ఒక్క వార్త కూడా రాకపోవడమే తమ దురదృష్టమని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఏపీ రాజధానిలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించడంలో మీడియా కూడా ఉద్దేశపూర్వక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఆయన స్పందించడు.... ఇయన లెక్క చేయడు.....

ఏపీ రాజధాని అమరావతికి తరలించిన తర్వాత చాలా మంది ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నట్లు తయారైంది. అటు ప్రభుత్వ సహకారం లేక., ఇటు ప్రతిపక్ష నాయకుడు స్పందించకపోవడంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల విష‍యంలో గతంలో ప్రభుత్వ., ప్రతిపక్షాల అండదండలు సందర్భానుసారం అయా సంఘాలకు అందేవి., ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలన్ని స్వీయ అస్తిత్వాన్ని వెదుక్కునే దుస్థితిలోనే ఉండటంతో ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తమ దారి తాము చూసుకునే పరిస్థితి వస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Similar News