నల్లారి కిరణ్ : రాజకీయం మిగిలే ఉంది!!

Update: 2016-11-04 04:14 GMT

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అంటేనే.. ఇక ఆయన రాజకీయ జీవితం అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లే అని అందరూ అనుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ ఓ అరుదైన రికార్డును తన పేర సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెసు పార్టీలో చాలా అరుదుగా జరిగే రీతిలో ఆయన పార్టీ హైకమాండ్ తో చాలా పెద్ద ఎత్తున పోరాడారు. వారి మాట ఖాతరు చేయకుండా వ్యవహరించారు. ఏతావతా పార్టీ ఆగ్రహానికి కూడా గురయ్యారు.

ఎన్నికల గంట మోగగానే జై సమైక్యాంధ్ర పేరిట సొంత కుంపటి పెట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కొందరు సీనియర్ నేతల మద్దతు సంపాదించారు గానీ.. ఓట్లను మాత్రం రాబట్టుకోలేక చతికిలపడ్డారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తన సొంత నియోజకవర్గాన్ని కూడా కోల్పోయారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత.. కిరణ్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు.

ఆయనను తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఏపీలో బలపడడం ద్వారా కాంగ్రెస్ పతనం వలన ఏర్పడిన వాక్యూమ్ లో తాము స్థిరపడాలని కోరుకుంటున్న భాజపా ఆయనకు గేలం వేసింది. తెలంగాణ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి , నల్లారి కిరణ్ కు స్నేహితుడు కూడా. కిరణ్ వద్దకు ఆయన పార్టీలో చేరడం గురించి రాయబారం కూడా నడిపాడు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఒక పట్టాన అంగీకరించలేదు. ఆయన వస్తే సామాజిక వర్గాల పరంగా తమ పార్టీ మెరుగుపడుతుందని.. భాజపా అనుకుంది. అయినా కిరణ్ ఓకే చెప్పలేదు.

అయితే.. ఇదంతా రాష్ట్రం విడిపోవడం వలన కిరణ్ కుమార్ రెడ్డిలో వచ్చిన వైరాగ్యం మాత్రమే ఏమో అని అంతా అనుకున్నారు. ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసిగా మారిపోయారని అంతా భావించారు.

తాజాగా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి సన్నిహితులు, సొంత వారితో మాట్లాడుతూ పెళ్లి సంబంధం మాట్లాడడం పూర్తయింది.. పెళ్లి ముహూర్తం ఖరారు కావాలి.. పెళ్లికూతరు ఎవరనేది అప్పుడు తెలియజెప్తా అని కామెంట్లు చేయడాన్ని బట్టి.. ఆయన లైఫ్ లో రాజకీయ ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయనే అనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా గొప్ప వాగ్ధాటి లేకపోవడం, ఆయన క్రౌడ్ పుల్లింగ్ నాయకుడిగా ఎదగకపోవడం పెద్ద లోపాలు. కిరణ్ ఏ పార్టీలో చేరినా సరే.. ఒక సామాజిక వర్గ ప్రతినిధిగా మరింత మంది నేతలను ఆ పార్టీకి పోగేయడానికి ఉపయోగపడగలరే తప్ప.. తాను స్వయంగా తన ఛరిష్మాతో ఓట్లు వేయించేంత నేత కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News