దొంగలు దొరికారు...గోల్డ్ జాడ ఏదీ?

Update: 2017-01-13 05:15 GMT

దొంగలు దొరికారు...కాని బంగారం మాత్రం దొరకలేదు. ఇది నిజం. రామచంద్రాపురం లోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ దొంగలు చెలరేగిపోయి 46 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన సంగతి గుర్తుంది కదా. ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి దొరికినంత బంగారాన్ని దోచుకుపోయారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు 16 బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను మొత్తం గాలించి ఎట్టకేలకు దొంగలనయితే దొరకబుచ్చుకున్నారు. ఈ కేసులో కర్ణాటకు చెందిన లక్ష్మీనారాయణతో పాటు మరో ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.

అయితే దోపిడీ దొంగలయితే పట్టుబడ్డారు కాని బంగారం మాత్రం వారి నుంచి రికవరీ చేయలేకపోతున్నారు. దొంగలు దొరికి వారం కావస్తున్నా బంగారం ఆచూకీ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇప్పడు బంగారం కోసం మళ్లీ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. దొరికిన దొంగలు తమ వద్ద బంగారం లేదని....తమ సహచరుల దగ్గర ఉందని చెబుతున్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. దొరికిన దొంగలు మాత్రం పోలీసులకు రోజుకో ప్రాంతం పేరు చెప్పడంతో అక్కడకు వెళ్లడం ఉత్తచేతులతో తిరగి రావడం రోజూ పోలీసులకు అలవాటుగా మారింది. బంగారం రికవరీ కాకుంటే పోలీసులు సాధించిందేముంటుందని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. రోజూ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఖాతాదారులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో పోలీసు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మొత్తానికి దొరికిన దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తుండగా...ఖాతాదారులు మాత్రం తమ బంగారం ఎప్పుడు దొరుకుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Similar News