దేవుడి ముందు కులాల కోటా హేయం

Update: 2016-10-12 13:44 GMT

దేవుడి ఎదుట కూడా కులాల వారీగా భక్తులను అనుమతిస్తారా? ఈ దేశంలో ఈ జాతి దేవుడి విషయంలో కొన్ని శతాబ్దాలు పరిగణించిన కుల వివక్షను మళ్లీ పాదుగొల్పడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఓ అవివేకమైన నిర్ణయం తీసుకుంటున్నదా? తాజాగా దేవాదాయ శాఖలో తీసుకున్న ఓ నిర్ణయం అలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తోంది.

బుధవారం నాడు వెలగపూడి సెక్రటేరియేట్ లో చంద్రబాబునాయుడు మాత్రమే కాదు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు కూడా తన కార్యాలయాన్ని ప్రారంభించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను ఇంప్రెస్ చేయడానికి వెలగపూడిలో తొలి సంతకం చేసినట్లుగానే.. పైడికొండ మాణిక్యాల రావు కూడా తన శాఖలోని ఉద్యోగుల ఆదరణ చూరగొనడం లక్ష్యంగా వారి రిటైర్మెంటు పరిమితి 60 ఏళ్లకు పెంచే ఫైలు మీద తొలి సంతకం చేశారు.

అయితే ఈ సందర్భంగా ఆయన కూడా మరికొన్ని వివరాలు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనది దివ్యదర్శనం అనే కొత్త పథకం. రాష్ట్రంలో ప్రధానమైన దేవాలయాలను భక్తులు ఉచితంగా దర్శించే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. అయితే ఈ వెసులుబాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి మాత్రమే వర్తిస్తుందిట. దేవుడి దర్శనాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడానికి కులాలను ప్రాతిపదికగా తీసుకోవడం, దేవుడి ఎదుట కులాల వారీగా భక్తుల్ని వేరు చేసి చూపించడం అనే ఆలోచన ద్వారా.. సమాజాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ప్రభుత్వాలకు అలవాటే గానీ.. అందుకోసం అత్యంత హేయమైన రీతిలో దేవుడి ఎదుట కూడా కులాల వివక్ష ఘోరంగా ఉంది. దివ్యదర్శనం పేరిట ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయాలనే సదుద్దేశం ప్రభుత్వానికి ఉంటే గనుక.. అందుకు ప్రాతిపదికగా కేవలం వయోపరిమితిని మాత్రం ఎంచుకుంటే బాగుటుంది. కులాలతో నిమిత్తం లేకుండా.. వయస్సు పైబడిన వారిని జీవితంలో ఇక ఒకసారైనా దేవుడిన దర్శించుకోవాలని తపిస్తుండే వారికి అవకాశం కల్పించేలా.. వృద్ధులకు మాత్రం అవకాశం ఇస్తూ.. ఈ దివ్యదర్శనం ఆలోచన చేస్తే దివ్యంగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రతి విషయాన్నీ ఓటు బ్యాంకు రాజకీయంగా ఆలోచించకుండా, కనీసం దేవుడిని అయినా కాస్త సరైన ప్రాతిపదిక మీద చూస్తే బాగుంటుంది. దీనివల్ల పాలపక్షాలకు కూడా మంచి పేరు లభిస్తుంది.

Similar News