దేవినేని నెహ్రూ ఇలా బుక్కయ్యారా?

Update: 2017-02-21 11:30 GMT

ఒకప్పుడు ఆ‍యన కంటి చూపుతో జిల్లాను శాసించేవారు..... పేరు చెప్పుకోడానికే ప్రత్యర్ధులు జంకేవారు..... అధికార చదరంగంలో పార్టీ మారినా., ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇంతకాలం అదే హవా నడిచింది. ఆయనే దేవినేని నెహ్రూ. రాష్ట్రవిభజన తర్వాత పరిణామాల నేపథ్యంలో చాలామంది నేతల మాదిరే ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు మీద బెంగపట్టుకుంది. అయినా రెండేళ్లు ఓపిక పట్టారు. రాను రాను పరిస్థితి గడ్డుగా తయారవడంతో పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఆ ప్రయత్నాలు జరిగినా ఏ కారణం వల్లనో అది కార్యరూపం దాల్చలేదు.

బాబు అపాయింట్ మెంట్ కూడా కష్టమే...

పదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు రాజకీయ తంత్రంతో ప్రతిపక్ష పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ ఓడిన చోట కూడా ఇన్‌ఛార్జిలకే ప్రాధాన్యం ఇస్తుండటం., ప్రభుత్వంలో ఒక్క పని కూడా కాని పరిస్థితి తయారైంది. ఇక అధికార పక్షంలో ఉన్న నేతల హవా మూడు పనులు., ఆరు కాంట్రాక్టులుగా సాగుతుండటం., ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోలుకుంటుదో తెలీని పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తనతో పాటు వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాల్సి ఉండటంతో పాత గొడవల్ని., విభేదాలను మరచి పసుపు జెండాను దేవినేని నెహ్రూ కప్పుకున్నారు. ఆ తర్వాత అనుచరులతో కలిసి ఓ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక అంతా గాడిన పడిందనుకుంటే నెలలు గడస్తున్నా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. చంద్రబాబుతో భేటీ అయితే పరిస్థితిలో మార్పు వస్తుందనుకుని అపాయింట్‌ మెంట్‌ అడిగారు.

టీడీపీలో ఇప్పడు సెకండ్ గ్రేడేనా?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు., జిల్లాలో మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన తనకు ఎక్కడైనా రెడ్‌ కార్పెట్‌ దక్కుతుందని భావిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు., పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లతో భేటీ కావాలనే ఉద్దేశంతో అనుచరులతో భారీ కాన్వాయ్‌తో గుంటూరు తరలి వెళ్లారు. అయితే అక్కడ కలవాల్సిన నేత లేకపోవడంతో ఊసురుమంటూ తిరిగి రావాల్సి వచ్చిందట. ఇలా వరుసగా మూడ్రోజుల పాటు సీన్ రిపీట్‌ అయ్యిందట. చివరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావుతో చర్చించి సంతోషపడాల్సి వచ్చిందట..... ఈ ఘటన తర్వాత టీడీపీలో చేరి తప్పు చేశామని నెహ్రూ బాధపడ్డారట. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా.? కాకతాళీయమా తేల్చుకోలేక సతమతమవుతున్నారట పెద్దాయన. నిజానికి టీడీపీలో చేరడానికి ముంధూ మరో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా అవి కొలిక్కి రాకపోవడంతో టీడీపీ గుమ్మం ఎక్కాల్సి వచ్చిందని జిల్లాలో చెప్పుకుంటారు. జిల్లాలో ఉన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా., మొదట్నుంచి ఉన్న వారి ఇష్టానికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని చేర్చుకుంటే ఇబ్బంది కలుగుతుందనే భావనతోనే సదరు నేత రాకకు అమోదం దొరకలేదని చెబుతారు. తాజాగా టీడీపీలో ఎదురవుతున్న పరిణామాలతో కలత చెందిన దేవినేని నెహ్రూ భవిష్యత్తుపై సన్నిహితులతో వ్యూహరచన చేస్తున్నారట.....

Similar News