దీని భావమేమి చంద్రశేఖరా?

Update: 2016-11-02 04:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు త్వరలో ఒక ఘన సన్మానం జరగబోతోంది. నిజానికి ముఖ్యమంత్రిగా ప్రదర్శించిన నాయకత్వ పటిమకు ఆయన సత్కారానికి నూరుశాతం అర్హులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఒకే ఏడాది వ్యవధిలో 13వ స్థానం నుంచి 1 వస్థానానికి తీసుకురావడం అంటే మాటలు కాదు. అదేసమయంలో పారిశ్రామికేతర రంగాల్లో జరుగుతున్న ప్రయత్నమూ చిన్నదని కాదు.. అందుకు సత్కారం మంచిదే అనుకోవచ్చు. కానీ సదరు సత్కారం చేస్తున్నది ఓ కులసంఘం వాళ్లు.

కులసంఘాలు రాజకీయ ప్రముఖులకు సత్కారాలు చేయడం, వారి ద్వారా తమ కులానికి, లేదా తమకు లబ్ధి పొందాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేం సత్కారం చేస్తున్నాం.. అంటూ అడ్డగోలుగా చందాలు దండేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఓ కుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన సత్కారం ఫలానా తేదీన ఫలానా వేదిక వద్ద జరగబోతున్నట్లుగా టీవీల్లో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ప్రకటనలు సహజమే.

కాకపోతే.. కాంటాక్ట్ చేయండి.. అంటూ కొన్ని మొబైల్ నెంబర్లు కూడా ఇస్తున్నారు. అంటే కేసీఆర్ కు జరిగే సత్కారంలో తాము కూడా పాల్గొని ఒక శాలువా ‘‘తమ చేతుల మీదుగా కప్పి సత్కరించడానికి’’ ఉత్సాహం ఉన్నవాళ్లు కాంటాక్ట్ చేస్తే.. సదరు అవకాశానికి కాగల ధర ఎంతో అప్పుడు సెలవిస్తారన్నమాట. ‘కేసీఆర్ కు సత్కారం ముసుగులో వారు ప్రకటనలు ఇచ్చి మరీ డబ్బు దండేసుకునే ప్రయత్నాలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎవరు సత్కరించినా సరే.. నలుగురూ ఆర్థిక భారం పంచుకోకుండా కార్యం నెరవేరదు. కులసంఘం చేస్తున్నప్పుడు, అది సంఘం తాలూకు అంతర్గత వ్యవహారంగా ఉండాలి. అంతేతప్ప.. ఓపెన్ కలెక్షన్ వ్యవహారమే ఆసక్తికరం.

కులసంఘాల పట్ల కేసీఆర్‌కు గౌరవం ఉండవచ్చు. కాదనకూడదు. ఆయన తనను ఏ సంఘం వారు కలిసినా వారికి ఖచ్చితంగా హామీలు ఇస్తున్నారు. అడిగిన పనులు ఆమోదిస్తున్నారు. అయితే తన సత్కారం పేరిట ఇలా చందాలెత్తే వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి పెద్దమనిషి ప్రోత్సహించకుండా ఉంటే బాగుంటుంది.

 

Similar News