తెలుగు ప్రభుత్వాలకు జేపీ సూచన వినిపిస్తోందా?

Update: 2016-11-03 00:39 GMT

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తన సైద్ధాంతిక నిబద్ధతకు, నైతిక విలువలకు పెట్టింది పేరు. జనంలో ఆదరణలో ఉన్న వ్యత్యాసాలకు విసిగి ఆయన తన పార్టీని రద్దు చేసేశారు. అయితే లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థ తరఫున కార్యక్రమాలు మాత్రం మానుకోలేదు. ఆయన తాజాగా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులకు సంబంధించిన ఫైళ్లు పెండింగులో పడిపోయేటప్పుడు సదరు ఉద్యోగికి అపరాధ రుసుము విధించాలని ఆయన అంటున్నారు. తాము చేయాల్సిన విదులను నిర్వర్తించడంలో జాప్యం చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందనే జవాబుదారీ తనాన్ని ప్రభుత్వ యంత్రాంగంలో పెంచడానికి ఇది ఉపకరిస్తుందని జేపీ చెబుతున్నారు.

రాష్ట్రమంతా లోటు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఉద్యోగులకు మాత్రం 42 శాతం జీతాలు పెంచారని, మరి అలాంటప్పుడు వారు విధుల్ని అంతే బాధ్యతగా చేయాలని సూచించారు.

అయితే జేపీ చేసినది చాలా చక్కటి సూచనే కావొచ్చు. కానీ తెలుగు ప్రభుత్వాలు దానిని చెవిన వేసుకుంటాయా? అనేది సందేహం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల ముఖప్రీతికోసం వేతనాలను పెంచడం అనేది తమ ఘనత కింద ఊహించుకుంటూ చేసిన ప్రభుత్వాలే. వేతనాలు పెంచడం తప్పని కాదు గానీ.. తదనుగుణమైన జవాబుదారీ తనాన్ని ఉద్యోగుల్లో పెంచకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వాల లోపమే.

చంద్రబాబునాయుడు , కేటీఆర్ లాంటి వారు ఆధునిక సాంకేతికతను పరిపాలనలో వాడే అనేక పద్ధతుల గురించి చర్చిస్తూ ఉంటారు. మొక్కలకు జియో ట్యాగింగ్ చేయిస్తామని, శాటిలైట్ ద్వారా పరీక్షిస్తుంటామని, పొలాలకు ఎన్నినీళ్లు వాడుకున్నారో కూడా లెక్క తెలిసిపోతుందని.. ఇలా సవాలక్ష రూపాల్లో ప్రజల నడ్డి విరవడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. అదే సమయంలో.. ఒక ప్రభుత్వాఫీసులో పని చేస్తున్నారా లేదా తనిఖీ చేసే వ్యవస్థను కూడా తన కార్యాలయాల్లో ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఒక సామాన్యుడు ఇచ్చిన అర్జీ కదిలిందో లేదో, ఒక్కొక్క గుమస్తా దాన్ని ఎన్ని నెలలు తన సీటుకింద పెట్టుకున్నాడో కనిపెట్టే ఒక సాఫ్ట్ వేర్ ను తయారుచేయించడం- సాంకేతికతను బాగా ఇష్టపడే ఈ నాయకులకు సాధ్యం కాదా? అయితే ఉద్యోగుల విషయంలో వారి విచ్చలవిడితనానికి బ్రేకులు వేయడానికి ధైర్యం లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Similar News