‘తెరాస సర్కార్’ అంటే కేటీఆర్! : స్పష్టంగా సంకేతాలు!

Update: 2016-12-04 04:30 GMT

సండే స్పెషల్ :

తెలంగాణ అనే నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత.. రాష్ట్రం అనే డిమాండ్ ను ఉద్యమంగా మార్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనల్పమైన ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా జనరంజకమైన పరిపాలననే సాగిస్తూ వస్తున్నది. విపక్షాల విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాము నమ్మిన బాటలోనే ముందుకు పోతున్నది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి , గులాబీ బాస్ కేసీఆర్ తిరుగులేని శక్తి కాగా, తెరాస ప్రభుత్వంలో అధికార కేంద్రాలుగా సీఎం తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ఉన్నారని ... మీరి మధ్య ఆధిపత్య పోరాటం ప్రచ్ఛన్నంగా ఉన్నదనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కనిపిస్తున్న సంకేతాలు అచ్చంగా తెరాస ప్రభుత్వంలో కేటీఆర్ దే పైచేయి అని స్పష్టం చేస్తున్నాయి.

ఈ పరిణామము ఎవ్విధముగా జరిగినదనగా.. వివరాల్లోకి వెళితే...

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అంటే ప్రభుత్వం సగం పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నట్లు! సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన రోజున ప్రతిఏటా పత్రికలు కథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురిస్తూ ఉంటాయి. అయితే ఈదఫా ‘రెండున్నరేళ్లు’ పూర్తి కావడాన్ని కూడా ఓ అకేషన్ గా వారు పరిగణించారు. (పరిగణించాలా చేయడం జరిగిందని అనుకోవాలి.) అందుకోసం కథనాలను వండి వార్చారు.

ఇలాంటి సందర్భాలతో ముడిపెట్టి ప్రత్యేక కథనాలను ప్లాన్ చేస్తే.. విధిగా ‘ప్రభుత్వాధినేత’ ల ఇంటర్వ్యూలను మాత్రమే పత్రికలు ప్రచురిస్తాయి. అయితే ఈ విడతలో మాత్రం దాదాపుగా అన్ని పత్రికలూ క్యూ కట్టి మరీ కల్వకుంట్ల తారక రామారావు ఇంటర్వ్యూలను ప్రచురించాయి. ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తి చేసుకుంటే సీఎం ఇంటర్వ్యూలు కనిపించాలి గానీ.. ఇదేమిటా అని విస్తుపోవడం ప్రజల వంతయింది.

అయితే కేటీఆర్ కూడా ఆ ఇంటర్వ్యూలకు న్యాయం చేశారని చెప్పాలి. తాను కొన్ని శాఖలకు మాత్రమే మంత్రిననే సంగతి మరచిపోయి.. సాంతం తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు అన్నిటినీ ప్రస్తావిస్తూ అచ్చంగా ముఖ్యమంత్రి అయితే ఎలాంటి వివరాలు వెల్లడిస్తూ ఇంటర్వ్యూను నడిపిస్తారో అదే తరహాలో వాటిని రక్తి కట్టించారు.

అసలే కేసీఆర్ వారసత్వం మీద పార్టీలోనూ చిన్న వివాదం ఉంది. హరీష్ రావు తో కేటీఆర్ కు ఆధిపత్య పోరాటం ఉన్నట్లు కొన్ని వదంతులు , ప్రచారాలు ఉన్నాయి. వీటి విషయంలో క్లారిటీ ఇవ్వడానికి అన్నట్లుగా ఎంపీ కవిత లాంటి వాళ్లు చాలా స్పష్టంగా ‘మానాన్న వారసత్వం కేటీఆర్ కే వస్తుంది.. వేరేవాళ్లకు ఎలా వస్తుంది’ అని తేల్చేశారు కూడా. నిజానికి వివిధ విదేశీ డెలిగేషన్ కమిటీలతో భేటీ కావడమూ, ప్రభుత్వ వ్యవహారాలను నడిపించడంలోనూ ఆయన దూకుడు అదేస్థాయిలో ఉన్నదనే ప్రచారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి వారసత్వపు పుకార్లకు సంబంధించి.. ఓ అధీకృత ముద్ర వేస్తున్నట్లుగా .. ఇవాళ సీఎం స్థానే అన్ని పత్రికల్లో కేటీఆర్ ఇంటర్వ్యూలు రావడం ఆసక్తికరం.

ఏకస్వామ్య పార్టీగా, కేసీఆర్ ఇమేజి మీద నడుస్తూ ఆయన నాయకత్వం పట్ల అసామాన్యమైన భయభక్తులతో నడిచే పార్టీగా ఉన్న తెరాస లో అసంతృప్తులు, లుకలుకలు పుట్టినప్పటికీ ఒక పట్టాన బయటపడవు. అవి బయటపడే రోజు వచ్చిందంటే అప్పటికి బాగా ముదిరిపోయే ఉంటాయి. మరి ఇంటర్వ్యూల ద్వారా తన మనోగతం ఏమిటో నర్మగర్భంగా తెలంగాణ జాతికి తెలియజేసిన కేటీఆర్ ఇలాంటి చాణక్య వ్యూహాల పట్ల కూడా అప్రమత్తంగానే ఉంటారా? కాలం జవాబులు చెబుతుంది.

Similar News