తెదేపాలోకి లగడపాటి : అంత ఈజీయేం కాదు!

Update: 2016-11-05 04:23 GMT

లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారా? అవునో కాదో అనే చర్చ విజయవాడ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. కాకపోతే.. లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశంలోకి రాదలచుకున్నప్పటికీ, అధినేత చంద్రబాబునాయుడు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదలచుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు అందుకు సులువైన వాతావరణాన్ని కల్పించేలా లేవని పలువురు అంచనా వేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా క్రియాశీలంగా ఉండే కొందరు ఎంపీల్లో ఒకరైన లగడపాటి రాజగోపాల్.. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఎజెండాతో తీవ్రస్థాయిలో పోరాడారు. పార్లమెంటులో నానా రభస చేశారు. అల్లరి చేశారు. ఎన్ని చేసినా ఏమీ సాధించలేకపోయారు. ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్రాన్ని విభజించినందుకు ఆయన కాంగ్రెసుతో విబేదించారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే గనుక.. రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ముందునుంచి చెబుతూ వచ్చిన లగడపాటి.. అన్నట్లుగానే.. విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకున్నారు. సమైక్యాంధ్ర పార్టీల తరఫున కూడా ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇన్నాళ్లూ మౌనంగానే ఉండిపోయారు తప్ప.. రాజకీయంగా క్రియాశీలంగా కనిపించలేదు.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి తెలుగుదేశంలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే లగడపాటి తెలుగుదేశం లోకి వచ్చినా సరే ఆయనకు కోరుకునే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనేది అనుమానమే అని పలువురు భావిస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటు తెలుగుదేశంలో ఖాళీ లేదు. మరి తన కెరీర్ మొత్తం విజయవాడ రాజకీయాల మీదనే పెట్టుబడిగా పెట్టిన లగడపాటి రాజగోపాల్.. ఆ నగరాన్ని వదిలేసి ఇతర ప్రాంత రాజకీయాలకు ఎలా అడాప్ట్ అవుతారనేది అనుమానమే. అలాంటి నేపథ్యంలో ఆయన తిరిగి తెలుగుదేశంలోకి రావడం అంత ఈజీగా కుదురుతుందో లేదోనని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News