తెగేవరకు లాగుదాం : వైకాపా ఎమ్మెల్యేల నిర్ణయం

Update: 2016-10-25 01:18 GMT

శాసనసభలో అనుచిత ప్రవర్తనకు సంబంధించి, హక్కుల కమిటీ నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఓ దృఢమైన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. శాసనసభలో తమ డిమాండ్‌ను వినిపించడమే తప్ప.. తాము చేసిన తప్పేమీ లేదని తొలినుంచి వాదిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు అదే వాదనకు కట్టుబడి, ఏమాత్రం తగ్గకుండా.. పరిణామాలు ఎంత దూరం వెళ్లినా సరే.. ఎదుర్కోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. మహా అయితే శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం తప్ప మరేమీ జరగబోదని.. కానీ తాము అందరం సస్పెండ్ అయినా సరే.. ప్రభుత్వం ఎంత దమననీతిని అనుసరిస్తున్నదో ప్రజలకు అర్థం అవుతుందని వైకాపా ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యేకహోదా గురించి తొలినుంచి ఒకే రీతిలో పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ తమ గళాన్ని గట్టిగానే వినిపించింది. అయితే తీర్మానం చేయడం గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైకాపా ఎమ్మెల్యేల డిమాండ్ ను ఖాతరు చేయలేదు. సమావేశాలు ముగిసిన సుమారు రెండు నెలల తర్వాత.. 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇవ్వడం జరిగింది. మంగళ, బుధవారాల్లో ఆరేసి మంది వంతున ఎమ్మెల్యేలను రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

ఆమేరకు మంగళవారం నాడు కొడాలి వెంకటేశ్వరరావు- నాని (గుడివాడ), చెవిరెడ్డి భాస్కర రెడ్డి (చంద్రగిరి) , రామలింగేశ్వరరావు (తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు) లను మంగళవారం హక్కుల కమిటీ విచారించనుంది.

అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని , ప్రత్యేకహోదా కోసం తమ గళాన్ని వినిపించడమే తప్పయితే.. అందుకు ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని మాత్రమే వాదించాలని వీరంతా నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమ మీద హక్కుల కమిటీ ఏదైనా తీవరమైన చర్య తీసుకున్నా సరే.. దానికి సిద్ధపడే ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. తీవ్రమైన చర్యే గనుక తీసుకుంటే.. హోదా అడిగినందుకు 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారనే విషయాన్ని జనం దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయవచ్చునని వారు వ్యూహాత్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News