తె-కాంగ్రెస్ బాటలోనే మురిసిపోతున్న జగన్

Update: 2016-12-12 08:47 GMT

రాజకీయ నాయకులకు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. తాము పనిచేస్తున్నాం అని చెప్పుకోవడం అధికార పార్టీల్లో ఉండే నాయకులకు సహజంగా ఉండే ఎడ్వాంటేజీ. తాము పోరాడడం వల్ల మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్నదని చాటుకోవడం ప్రతిపక్షాలకు ఉండే వ్యూహం. తెలంగాణలో అచ్చంగా కాంగ్రెస్ పార్టీ ఇదే పనిచేస్తోంది. తాము పోరాడడం వల్ల మాత్రమే... ఫీజు రీఇంబర్స్ మెంట్ విడుదల అవుతున్నదని, తాము పోరాడడం వల్లే అసెంబ్లీ పెడుతున్నారని .. చెప్పుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ కూడా.. అచ్చంగా తె కాంగ్రెస్ బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వైఎస్ జగన్మోహన రెడ్డి తన పార్టీ పోరాటాల వల్లనే, జగన్ స్వయంగా చేస్తున్న దీక్షలు పర్యటనల వల్లనే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఇప్పుడు ప్రచారం చేసుకుంటోంది. జగన్ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. దారమ్మట వస్తూ వస్తూ ఓ హాస్టల్ ను కూడా సందర్శించి విద్యార్థులకు బాత్రూంలు గట్రా సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారి కష్టాలు తీర్చాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాత సంబంధిత అధికారులు అక్కడకు వచ్చి ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు.

అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్.. తమ జగన్ పూనికతో మాత్రమే ప్రభుత్వంలో కదలిక వస్తున్నదని.. లేకపోతే వారు ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకోవడం లేదని దెప్పి పొడుస్తున్నారు. అయితే ముందే అనుకున్నట్టు ప్రభుత్వం ఖచ్చితంగా తనంతగా పరిష్కరించడానికి సిద్ధమవుతున్న సమస్యలు ఏమిటో ముందుగానే తెలుసుకుని దాని, వాటి మీద పోరాటాలు సాగించి, ప్రభుత్వం తన చర్యలు తాను తీసుకోగానే.. తమ పోరాటం వల్ల మాత్రమే పాజిటివ్ రిజల్టులు వస్తున్నాయని టముకు వేసుకోవడం అంటే వైకాపా నాయకులకు మాత్రమే చెల్లుతోంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News