తిరుమలలోనూ శైవం

Update: 2017-02-24 00:30 GMT

తిరుమల వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష్య దైవం. శ్రీవారిని మహావిష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు. తిరుమల వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఇక్కడ శివుడి రూపాలు కూడా ఉన్నాయంటున్నారు శైవ భక్తులు. సాక్షాత్తూ పరమశివుడే విష్ణువు రూపంలో వెలిశాడని భావిస్తారు. శ్రీవారి రూపంలో అనేక శైవ గుర్తులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడు కావడంతో తిరుమల శివకేశవుల క్షేత్రంగాను అనేక మంది భావిస్తారు. నేడు శివరాత్రి సందర్భంగా తిరుమల క్షేత్రంపై తెలుగు పోస్ట్ ప్రత్యేక కథనం..

అడుగడుగునా...శైవ రూపాలే...

తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడు పూజలందుకుంటాడు. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే తిరుమల గిరులు శైవ క్షేత్రం లక్షణాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు భక్తులు. తిరుమల క్షేత్రపాలకుడిగా శివుడే ఉంటూ శ్రీవారికి రక్షకుడిగా ఉన్నారని చెబుతారు. తిమరుమల ప్రవేశించే ముఖద్వారమైన అలిపిరి ప్రాంతంలో ఉన్న కపిల తీర్థ స్వామి శివుడే. తిరుమలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా కపిల తీర్ధాన్ని దర్శించుకుని శివయ్య ఆశీస్సులు పొందుతారు. తిరుమలకు వెళ్లే నడక మార్గంలో అనేక శైవ గుర్తులు మనకు కన్పిస్తాయి. ఏడు కొండలలోని ఒక కొండ శివలింగాన్ని సంతరించుకుని ఉండటం ఇందుకు ఉదాహరణగా చెబుతారు. తిరుమల రెండో ఘాట్ లో హరిణి దాటిన తర్వాత భారీ శివలింగం మనకు కన్పిస్తుంది. ఇక తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న గోగర్భం వద్ద తిరుమల క్షేత్ర పాలకుడిగా రుద్రుడు అంటే శివుడే కొలువై ఉన్నాడంటారు. ప్రతి సోమవారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. శ్రీవారి ఆలయానికి వాయువ్యం దిశన చక్రతీర్ధం వద్ద కూడా శివుడు కొలువై ఉన్నాడని పురాణ గాధలు చెబుతాయి.

నాగా భరణాలతో...

ఇక శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తే శివుడి అత్యంత ఇష్టమైన నాగాభరణం శ్రీవారి ఆభరణంగా కన్పిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడంటారు. అలాగే తిరుమలలోని శ్రీవారికి కూడా నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే నిత్యం సుప్రభాత సమయంలో శ్రీవారి బంగారు వాకిలి తెరవాలంటే శివుడి విగ్రహం ఉన్న తాళం చెవితోనే తెరవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. మొత్తం మీద తిరుమల వైష్ణవ క్షేత్రమైనా....శివుడి ఆనవాళ్లు ఉండటంతో శైవ భక్తులు కూడా ఇది శైవ క్షేత్రంగానే నమ్ముతుంటారు.

Similar News