తాను అనుకున్నదే కేసీఆర్ చేస్తారా?

Update: 2017-02-06 23:30 GMT

ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తొలినాళ్లలో కేసీఆర్ ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ కడతామన్నారు. అయితే దీనిపై విమర్శలు విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్రస్థాయిలో రావడంతో ముఖ్యమంత్రి కొంత వెనకడుగు వేశారు. సచివాలయాన్ని తరలించేందుకు కూడా అప్పట్లో కమిటీని నియమించారు. కాని ముందుకు సాగలేదు. ఇక సచివాలయాన్ని కూల్చరని అందరూ భావించారు. అయితే తాజా బడ్జెట్ లో కొత్త సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్ అనుకున్నది అంత తేలిగ్గా వదిలిపెట్టరన్నది మరోసారి రుజువైంది.

కొత్త సచివాలయానికి రూ.వెయ్యి కోట్లు...

తెలంగాణ సచివాలయాన్ని కూల్చి వేసి కొత్తది నిర్మించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇందుకోసం డిజైన్లను కూడా తయారు చేశారు. ప్రస్తుత మున్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించాలంటే కోట్ల రూపయాలు ఖర్చవుతుంది. అధునాత సౌకర్యాలతో...అందమైన...పర్యావరణ హితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. కొత్త సచివాలయాన్ని నిర్మించడం కోసం ఏపీ సచివాలయాన్ని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఇందుకోసం మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా కేసీఆర్ నియమించారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో కేసీఆర్ కొంత వెనక్కు తగ్గారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడంతో ఈ పరిస్థితుల్లో నూతన సచివాలయ నిర్మాణాన్ని ఎందుకన్న భావనకు వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఆదాయం మెరుగుపడటంతో మళ్లీ తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని కల్వకుంట్ల నిర్ణయించుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. ఇది ప్రాధమిక అంచనా మాత్రమే. దీని విస్తీర్ణం పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు. ఇందుకోసం వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ లోనే కొత్త సచివాలయ నిర్మాణానికి నిధులు కేటాయించనున్నారు. మరి బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశం హట్ టాపిక్ గా మరే అవకాశముంది. అయినా కేసీఆర్ వెనక్కు తగ్గరు. తను అనుకున్నదే చేస్తారు. అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Similar News