డబ్బులు ప్రవహిస్తుంటాయ్.. తస్మాత్ జాగ్రత్త!

Update: 2016-11-09 03:12 GMT

500, 1000 రూపాయల నోట్లను తక్షణం నిషేధిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రభావం అనేక రంగాల మీద కనిపించే అవకాశం ఉంది. డిసెంబరు 31వ తేదీ వరకు ప్రజలు ఎవరైనా సరే.. ఈ నోట్ల డినామినేషన్ లో డబ్బులను బ్యాంకులకు వెళ్లి తమ సొంత బ్యాంకు ఖాతాల్లో వేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకు వారికి ఎలాంటి రుసుము పడే ప్రమాదం కూడా లేదు. అంటే ఇళ్లలో పెద్ద నోట్లలో డబ్బును కట్టలు కట్టి దాచుకున్న వాళ్లంతా ఇప్పుడు హడావుడిగా బ్యాంకులకు వెళ్లి డిపాజిట్లు చేసుకోవాలన్నమాట.

నల్లధనం పెద్దమొత్తాల్లో ఉండే వారికి ఒక్కసారిగా డిపాజిట్లు వేసుకోవడం కూడా సాధ్యం కాదు. బినామీలుగా తాము నమ్మదగిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు మరీ అంత ఎక్కువగా ఉండని సాధారణ వ్యక్తులను ఆశ్రయించి.. వారి చేతికి నగదు ఇచ్చి వారి అకౌంట్లలో వేసుకోవాల్సిందిగా కోరాల్సి ఉంటుంది. ఆ తరువాత నిదానంగా వారినుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి.. నల్లకుబేరుల ఎదుట మరో రకం అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితులు కనిపించడం లేదు.

అయితే ఇది కూడా అంత ఈజీ యేం కాదు. ప్రధాని మోదీ నోట్ల నిషేధం గురించి జాతిని ఉద్దేశించి తన ప్రసంగం పూర్తిచేసిన తర్వాత.. రిజర్వు బ్యాంకు అధికారులు చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా హెచ్చరించారు. మీ మిత్రుల సొత్తు మీ అకౌంట్లలో వేసుకోవాల్సి వచ్చినా సరే.. న్యాయమైన డబ్బు విషయంలోనే మీరు డిపాజిట్లు చేసుకోండి. లేకపోతే ముందుముందు చిక్కులు వచ్చే అవకాశం ఉంది అని వారు హెచ్చరించారు.

ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వేర్వేరు బినామీ పేర్లతో అకౌంట్లలో డిపాజిట్లు చేయడానికి డబ్బు ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రవహించే అవకాశం ఉంది. అంటే నగదును నల్ల కుబేరులు తమకు నమ్మకమైన ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి రవాణా చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసుశాఖ భావిస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో చేసే తనిఖీల్లాగా రవాణాలపై ముమ్మర తనిఖీలు చేపడితే.. రాబోయే నెల రోజుల్లో కోట్లలో పెద్ద మొత్తాలు అక్రమ ధనం బయటపడవచ్చని కూడా అనుకుంటున్నారు. ఇలా పోలీసు తనిఖీల్లో రాబోయే రోజుల్లో వందల వేల కోట్లు బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం దేశవ్యాప్తంగా జూలు విదిల్చి ఎంత మేరకు అక్రమ నగదు రవాణాల్ని పట్టుకోగలుగుతుందో చూడాలి.

Similar News