ట్రంప్ దూకుడుకు కళ్లెం

Update: 2017-02-04 05:57 GMT

అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. వరుస వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను షేక్ చేస్తున్న ట్రంప్ కు అక్కడి న్యాయస్థానాలే ముక్కుతాడు వేస్తున్నాయి. ఏడు ముస్లిం దేశాల శరణార్ధులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమలుకానున్నట్లు అమెరికాలోని ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. గత వారమే ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముస్లిం దేశాల నుంచి వచ్చిన అనేక మందిని విమానాశ్రయాల్లోనే నిలిపేశారు. అరవై వేల వీసాలను కూడా రద్దు చేశారు. అయితే ఫెడరల్ కోర్టు స్టే ఉత్తర్వులపై ట్రంప్ టీమ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు ఉత్తర్వులపై స్టే కోరాలని భావిస్తోంది.

తగువల మారి ట్రంప్...

ట్రంప్ దూకుడు నిర్ణయాలకు అమెరికాలో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. కాని ఇవేమీ ట్రంప్ పట్టించుకోవడడం లేదు. నాకో తిక్కుంది....దానికో లెక్కుంది అన్నట్లు ట్రంప్ వ్యవహారముంది. హెచ్ 1 బి వీసాలపై కొన్ని ఆంక్షలు విధించడాన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ తప్పుపడుతున్నాయి. ట్రంప్ ఏడు దేశాలపై ఆంక్షలు విధించిన తర్వాత దాదాపు లక్ష వీసాలను అమెరికా రద్దు చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి వారి దేశాలకు పంపివేస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠత ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. నిన్న గాక మొన్న ఆస్ట్రేలియా ప్రధానితో ఫోన్ చేసిన ట్రంప్ మధ్యలోనే కట్ చేసి ఆయనను అవమానించారని చెబుతున్నారు. దశాబ్దాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఆస్ట్రేలియా అధ్యక్షుడిని కూడా ట్రంప్ వదలిపెట్టలేదు. దీంతో ఆ దేశంలో కూడా ట్రంప్ కువ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో వ్యాపారం చేస్తూ తక్కువ పన్నులు చెల్లిస్తున్న వారిని ఉపేక్షించబోమని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాకు చెల్లిస్తున్న పన్నును పెంచుతామని ట్వీట్ చేయడంతో అన్ని దేశాలతో తగవు పెట్టుకునేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే అమెరికాలోని న్యాయస్థానాలు ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుండటంతో కొంతలో కొంత మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఆయన వైఖరితో అన్ని దేశాలూ దాదాపు టెన్షన్ పడుతున్నాయి. మొత్తం మీద ట్రంప్ తీసుకునే రోజుకొక నిర్ణయం పట్ల అమెరికన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News