టీడీపీ - టీఆర్ఎస్ పొత్తు... కొత్త క‌థ ఇదే..!

Update: 2017-11-11 05:30 GMT

తెలంగాణ టీడీపీ విచిత్రమైన ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. టీడీపీ అధినేత, జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఏపీకి సీఎంగా ఉన్నారు. అయినా కూడా ఆయ‌న అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ పార్టీని గెలుపు గుర్రాలు ఎక్కించాల‌ని త‌హ‌త‌హలాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఏపీలో ప్ర‌తిప‌క్షం నుంచి ఎమ్మెల్యేల‌ను వ‌రుస పెట్టి సైకిలెక్కించుకుంటున్నారు. అయితే, తెలంగాణ‌లో మాత్రం ప్ర‌తిప‌క్షంగా ఉన్నందున పార్టీని బ‌లోపేతం చేయాల‌ని, గ‌తంలో టీడీపీ హ‌యాంలో జ‌ర‌గిన అభివృద్ధిని వివ‌రించ‌డంతోపాటు నేత‌ల‌ను కూడా భారీగా చేర్చుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణకు చెందిన సీనియ‌ర్ టీడీపీ నేత‌ల‌ను అమ‌రావ‌తికి పిలిచి మ‌రీ గంట‌ల కొద్దీ దిశానిర్దేశం చేశారు.

పొత్తుపైనే నేతల ఆశలు....

అంతేకాదు, అవ‌స‌ర‌మైతే.. ప్ర‌స్తుత తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు కూడా వెనుకాడే ప్ర‌శ్న‌లేద‌ని, చూచాయ‌గా చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణ‌లో టీడీపీ నేత‌లు పొత్తుపై ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ‌కు ఒంట‌రిగా గెలిచే స‌త్తా లేక‌పోయినా.. జిల్లాల్లో కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసుకుని కేసీఆర్‌తో జ‌ట్టుక‌ట్టి 2019 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని హుషారెత్తారు. టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌, గ‌వ‌ర్న‌ర్ గిరీపై ఆశ‌లు పెట్టుకున్న మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, నామా నాగేశ్వ‌ర‌రావు వంటి వారు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా బాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నేత‌ల్లో ఎక్క‌డా లేని హుషారు క‌నిపించింది. అధికార పార్టీపై అప్ప‌టి వ‌ర‌కు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు తాళం వేశారు.

కేసీఆర్ ఆలోచన వేరు....

అస‌లు వాస్త‌వంగా చెప్పాలంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో పొత్తును వ్య‌తిరేకించే రేవంత్‌తో పాటు ఆయ‌న గ్యాంగ్ మొత్తం టీడీపీకి గుడ్ బై చెప్పేసింది. రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ త‌ర్వాత దాదాపు అంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ - టీఆర్ఎస్ పొత్తు ఉంటుంద‌న్న అంచ‌నాకు వ‌చ్చేశారు. అయితే, ప‌రిణామాలు మ‌రో విధంగా ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్‌.. బాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితులు ఇప్పుడు రేఖా మాత్రంగా కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వివిధ జిల్లాల నుంచి వ‌స్తున్న టీడీపీ నేత‌ల‌ను కేసీఆర్ స్వ‌యంగా కండువా క‌ప్పి త‌న కారెక్కించుకోవ‌డ‌మే. నిజానికి పొత్తు పెట్టుకోవాల‌ని అనుకుంటున్న త‌రుణంలో ఇలా టీడీపీ నేత‌ల‌ను నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నికి కేసీఆర్ పూనుకోరు క‌దా అంటున్నారు విశ్లేష‌కులు. దీనిని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌స‌రం లేకుండా.. అస‌లు ఆ పార్టీలో నేత‌లే లేకుండా కేసీఆర్ వ్యూహం ర‌చించిన‌ట్టు తెలుస్తోంది.

పొత్తు ఇక లేనట్లేనా....?

ముఖ్యంగా రేవంత్ వంటి ఫైర్ బ్రాండ్ టీడీపీని వ‌దిలి వెళ్ల‌డంతోనే ఆ పార్టీకి రైట్ హ్యాండ్ పోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఉన్న న‌లుగురు ఐదుగురు కీల‌క నేత‌లు కూడా కారెక్కేస్తుండ‌డంతో పొత్తు అనే మాట కూడా వినిపించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఏదేమైనా.. బాబు పార్టీ ఇక‌, తెలంగాణ‌లో జెండా పీకేయ‌డ‌మే త‌రువాయి అనే క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. అయినా కూడామోత్కుప‌ల్లి వంటి రాజ‌కీయ దురంధ‌రులు మాత్రం మేం .. కేసీఆర్‌తో పొత్తుకు సై! అంటున్నారంటే.. వీరిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియ‌డం లేద‌ని విశ్లేష‌కులు నీళ్లు న‌ములుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతందో చూడాలి.

Similar News