టీ, ఏపీ పేదల క్యాంటీన్లకు, ‘అమ్మే’ స్ఫూర్తి

Update: 2016-12-06 09:22 GMT

తెలంగాణలో ఇవాళ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 5 రూపాయలకు భోజనం పెట్టే క్యాంటీన్లు నిరుపేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభిస్తున్న 5రూపాయలకు భోజనం పెట్టే ‘అన్న క్యాంటీన్లు’ కూడా నిర్భాగ్యుల క్షుద్బాధ ను తీర్చే అద్భుతమైన ఆలోచన. అయితే నిరుపేదల ఆకలి తీర్చడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ అభినందనలు అందుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ సదాలోచనకు మూలం ఎక్కడ ఉన్నదో తెలుసా.. తమిళనాడులో!! అక్కడి అమ్మ క్యాంటీన్లు, అక్కడ పేదలకు 5 రూపాయలకు అందజేస్తున్న భోజన సదుపాయం చూసే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్ఫూర్తి పొందాయి.

నిరుపేదలను ఉద్దేశించిన సంక్షేమపథకాలను రూపొందించడంలో జయలలితది ఒక విలక్షణమైన శైలి అని చెప్పాలి. ఇవాళ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తర్వాత.. లక్షల మంది గుండెలు పగిలేలా రోదిస్తున్నారంటే.. ఆ ప్రేమాభిమానాలు ఏదో అనాయాసంగా దక్కినవి కాదు. అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన విప్లవనాయకి ... పేదల గుండె చప్పుడును విని, వారి జీవితాల్లో తాండవించే ఈతిబాధలను గమనించి ఆ అవగాహన తో అనేక పథకాలకు రూపకల్పన చేశారు. అవే ఆమెను పేదలందరికీ అమ్మను చేశాయి. వారి హృదయాలకు దగ్గర చేశాయి.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా.. ఈ పేదల క్యాంటీన్ల విషయంలో .. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లనే మోడల్ గా తీసుకోవడం గమనించాల్సిన విషయం. ఇక్కడ జీహెచ్‌ఎంసీ ప్రారంభించినప్పుడు, ఏపీలో అన్న క్యాంటీన్లను ప్రారం భిస్తున్నప్పుడు గానీ.. ప్రభుత్వం తరఫున అధికారులతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాలు తమిళనాడుకు వెళ్లి.. అక్కడ అమ్మ క్యాంటీన్లు నడుస్తున్న తీరు, నిర్వహణ వ్యవస్థలను పరిశీలించి వచ్చిన తర్వాతే ఇక్కడ మొదలు పెట్లాయి. ఆ రకంగా.. ‘అమ్మ’ పురట్చి తలైవి జయలలితకు, తమిళనాడులోని నిరుపేదలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని పేదలంతా కూడా రుణపడి ఉండాల్సిందేనంటే అతిశయోక్తి ఏముంది.

Similar News