జేసీ బుర్రను కూడా పురుగు తొలిచిందా?

Update: 2016-10-08 04:27 GMT

పాకిస్తాన్‌ మీద సైన్యం నిర్వహించిన సర్జికల్‌ దాడుల విషయంలో దేశ ప్రజల్లో అనుమాన బీజాలు నాటడం ఇప్పుడు అవసరమా? దానికి అసలు ప్రాధాన్యం ఉందా? ఒకవేళ సర్జికల్‌ దాడులు అబద్ధమే అనికూడా అనుకుందాం..? సైన్యం మేం దాడిచేశాం అని ప్రకటించిన తర్వాత.. జాతి మొత్తం వారి వెన్నంటి ఉండాలా? లేదా, మీరు అబద్ధాలాడుతున్నారు.. రుజువులు చూపిస్తే తప్ప నమ్మం! అంటూ వారిని శంకించి విసిగించాలా?

జాతికి పట్టిన ఖర్మ ఏంటంటే.. సెలబ్రిటీల హోదాలను తగిలించుకుని మీడియాతో మాట్లాడగల అర్హతలున్న రాజకీయ నాయకులు తమ తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటున్నారు తప్ప.. జాతి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. దాడులు అనేవి మోదీకి ఎక్కడ కీర్తిని తెచ్చిపెడతాయో అని నాయకులు భయపడిపోతున్నారు. అందుని అడ్డగోలుగా ఆడిపోసుకోవడంలో భాగంగా.. తాము సైన్యాన్ని కించపరిచే జాతిద్రోహానికి పాల్పడుతున్నాం అని మరచిపోతున్నారు.

చూడబోతే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా ఎంపీ, సీనియర్‌ నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డికి కూడా ఈ పురుగు తొలిచినట్లుంది. భారత్‌ పాక్‌లు భిన్న వాదనలు వినిపిస్తున్నందున వీటి తాలూకు వీడియోలను చూపించాలని ఆయన అడుగుతున్నారు. అయినా పాక్‌ ఒక మాట అన్నంత మాత్రాన వారి మాటకు విలువ ఇవ్వాలనే ఉదాత్తమైన ఆలోచన మన గౌరవనీయ ఎంపీలకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఏదో పాకిస్తాన్‌ఎంపీలు డిమాండ్‌ చేసినట్లుగా వీరు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేసే సీనియర్‌ నేతగా పేరున్న జేసీ.. జరిగిన దాడుల వీడియోలను మాజీ ప్రధాని, మాజీ రక్షణ మంత్రులకు చూపించాలని జేసీ గారు కోరుతున్నారు.

చూడబోతే.. అసలు వీడియోలను చూపించాలనే డిమాండ్‌ చేయడంలోని నెగటివ్‌ సంకేతాలే జేసీకి అర్థమైనట్లు లేదు. సాక్ష్యాలు చూపించండి బాబూ.. అంటూ మీరు పనిచేశారో లేదో మేము అనుమానిస్తున్నట్లే అర్థం కదా! అలా సైన్యాన్ని అవమానించడం భావ్యమేనా? అనేది చర్చ. మరి జేసీ దివాకర్‌ రెడ్డి అంత సీనియర్‌ అయి ఉండీ, చాలా విషయాల్లో ప్రాక్టికల్‌గా మాట్లాడాతరనే పేరుండి కూడా ... ఇంత పేలవమైన కామెంట్లు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.

Similar News