జిల్లాల్లో చేసేదేం లేదు.. ఇంకేదైనా తిట్టిపోద్దాం..

Update: 2016-10-11 12:20 GMT

ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఏం చేస్తున్నా.. అందులో లోపాలను వెతికి వాటిని బహుళ ప్రచారంలో పెడితే తప్ప తమకు మనుగడ ఉండదని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటూ ఉంటాయి. పైగా తమ అస్తిత్వమే సందేహాస్పదంగా మారుతున్న దశలో ఉన్న పార్టీలకు అలాంటి ఆరాటం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భిన్నమైన వ్యూహంతో సిద్ధం అయినట్లుగా కనిపిస్తోంది.

తెరాస అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వం ఏ పని చేస్తున్నా సరే.. అందులో ఫలానా ఫలానా లోపాలు ఉన్నాయంటూ ఎత్తి పొడుస్తూ... పాదయాత్రలు, ప్రెస్‌మీట్‌లు ధర్నాలు గట్రా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖచిత్రం మార్చేస్తూ జిల్లాల విభజన చేపట్టిన నేపథ్యంలో.. ఈ జిల్లాల ప్రక్రియ మొదలైన నాటినుంచి కాంగ్రెస్ నాయకులు ప్రతిచోటా ఏదో ఒక రభస చేస్తూనే ఉన్నారు. ఆ మాటకొస్తే .. మాజీ మంత్రి డికె అరుణ తమ గద్వాల కేంద్రంగా జిల్లా సాధించుకోవడం మినహా .. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళనలు, కార్యక్రమాల వల్ల కేసీఆర్ సంకల్పించిన చిన్న జిల్లాల స్వరూపంలో ఎలాంటి మార్పు చేర్పులు రాలేదు.

తీరా ఇవాళ్టినుంచి కొత్త జిల్లాలతో సరికొత్త రూపురేఖలతో పాలన కూడా ప్రారంభం అయిపోయింది. అందుకే కాంగ్రెస్ నాయకులకు ఇక తాము చేయగలిగింది ఏమీ లేదని.. జిల్లాలకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టకపోతే.. జనం కూడా తమను పట్టించుకోరని అనిపించినట్లుంది. కాంగ్రెస్ పెద్దలంతా సోమవారం నాడు హైదరాబాదులో సమావేశమై.. ఇక జిల్లాల్లో విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతిపత్రాలు ఇవ్వాలని, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల విభజన అనేది పోరాట అంశంగా పాచిపోయిందని.. కొత్తగా ఏదో ఒక పాయింటు పట్టుకుంటే తప్ప.. తమ పార్టీకి మనుగడ ఉండదని కాంగ్రెస్ పార్టీ వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Similar News