జగన్‌ ఈ శ్రద్ధను హోదా విషయంలో చూపరేం!

Update: 2016-10-02 11:31 GMT

రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది రాజనీతి. అయితే ఈ విషయాన్ని వైఎస్‌ జగన్మోహనరెడ్డి అచ్చంగా ఇప్పుడే గుర్తించారా? అన్ని అంశాల్లోనూ ఈ రాజనీతిని పాటిస్తే ప్రయోజనం మెండుగా ఉంటుందని ఆయనకు తెలియదా? వంటి సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ప్రత్యేకించి.. భీమవరంలో ఓ ఆక్వాఫుడ్‌ పార్క్‌ సందర్శించేందుకు వెళ్లి, పోలీసుల దుశ్చర్యకు గురై అరెస్టయిన సీపీఎం కార్యదర్శి మధు విషయంలో జగన్‌ స్పందించిన తీరు అలాంటి సందేహాలు రేకెత్తిస్తోంది.

అయితే ఇప్పుడు విషయానికి వస్తే.. ఆక్వాఫుడ్‌ పార్క్‌ వంటి వాటిని సీపీఎం సిద్ధాంతరీత్యా వ్యతిరేకిస్తుంది. మంచిదే. మరి ఆ నేపథ్యంలో వారు వెళ్లి, అక్కడ మధు అరెస్టు అయ్యారు. ఆదివారం నాడు వైఎస్‌ జగన్‌, సీపీఎం మధుకు ప్రత్యేకంగా ఫోను చేసి పరామర్శించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఏపీలో తెదేపా, భాజపా కూటమి రాజ్యమేలుతున్నప్పుడు.. మిగిలిన పార్టీలన్నీ పైన చెప్పుకున్న రాజనీతి ప్రకారం మిత్రుల కిందే లెక్క. అయితే మిత్రధర్మంగా ఈ పార్టీలు వ్యవహరించిన ఘటనలు మనం ఇప్పటిదాకా చూడలేదు. వీరంతా ఒక్కతాటి మీద నడిచిఉంటే బహుశా రాష్ట్రంలో పరిస్థితులే వేరేగా ఉండేవేమో.

ఇవాళ భీమవరం ఆక్వాపార్క్‌ విషయంలో నిరసనతో వెళ్లిన మధును పరామర్శించడానికి , ఆ రకంగా సీపీఎంను దగ్గర చేర్చుకోవడానికి అన్నట్లుగా జగన్‌ స్పందిస్తున్నారు. అదే జగన్‌ ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాల్లో వారిని కలుపుకుని.. ఆ పోరాటాల స్థాయి పెంచే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు. వామపక్షాలు ప్రజా బ్యాలెట్‌ వంటివి నిర్వహిస్తే.. తమ పార్టీ తరఫున దానికి మద్దతు చెబుతూ.. ప్రజలందరూ వచ్చి ఇతోధికంగా హోదాకు అనుకూలంగా ఓటువేసి ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని, మన కోరికను కేంద్రానికి తెలియజెప్పాలని ఆయన ఎందుకు పిలుపు ఇవ్వలేకపోయారు.

ఇవన్నీ ప్రశ్నలే. జగన్‌ ఇవాళ మధును పరామర్శించినంత మాత్రాన.. ఆయన హోదా విషయంలో అందరినీ కలుపుకుని బలమైన పోరాటం సాగించే, తద్వారా లక్ష్యం సాధించే ఉద్దేశంతో మాత్రం లేరు. అక్కడ అచ్చంగా తనకు వీసమెత్తు తగ్గకుండా రాజకీయ మైలేజీనే ఆయన ఇచ్ఛగా కనిపిస్తోంది. మరి విపక్ష నాయకులు ఇలాంటి ద్వంద్వ వైఖరిని అనుసరిస్తూ ఉంటే.. ప్రభుత్వాలు పాల్పడే ఒంటెత్తు పోకడలే శిలాశాసనాలు అవుతాయి తప్ప.. వాస్తవమైన ప్రజాభిప్రాయానికి మన్నన ఎలా దక్కుతుంది?

Similar News